NTV Telugu Site icon

PV Sindhu Marriage: డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి.. వరుడు ఎవరంటే?

Pv Sindhu Marriage

Pv Sindhu Marriage

రెండు ఒలింపిక్‌ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్‌ పీవీ సింధు త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయిని సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వార్తను సింధు తండ్రి పీవీ రమణ ధ్రువీకరించారు. డిసెంబర్ 22న సింధు, సాయిల పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరగనుంది. ఈ నెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. డిసెంబర్ 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు ఆరంభం కానున్నాయి.

పీవీ సింధు తండ్రి పీవీ రమణ మీడియాతో మాట్లాడుతూ… ‘మా రెండు కుటుంబాలకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అయితే గత నెలలోనే పెళ్లి ఖాయం చేసుకున్నాం. వచ్చే జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడబోతోంది. అందుకే డిసెంబరు 22న పెళ్లికి ముహూర్తం నిర్ణయించాం. 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఉంటుంది. 20 నుంచి పెళ్లి వేడుకలు మొదలు అవుతాయి’ అని చెప్పారు. 29 ఏళ్ల సింధుకు కాబోయే వరుడు వెంకట దత్త సాయి పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్.

Also Read: Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..‘ది రాజా సాబ్’ టీజర్‌ కు ముహూర్తం ఫిక్స్

భారత గొప్ప అథ్లెట్లలో పీవీ సింధు ఒకరు. సింధు ఐదు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, రెండు ఒలింపిక్స్‌ పతకాలు గెలిచారు. రియో ​​2016, టోక్యో 2020లో ఒలింపిక్ పతకాలను సింధు గెలిచిన విషయం తెలిసిందే. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన సింధు.. 2017లో రజతం, 2018లో రజతం, 2013లో కాంస్యం, 2014లో కాంస్యం పతకాలు గెలిచారు. ఇక కామన్వెల్త్‌ క్రీడల్లో ఐదు పతకాలు సొంతం చేసుకున్నారు. 2017లో కెరీర్ అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 2కు చేరుకున్నారు. రెండేళ్ల తర్వాత సయ్యద్‌ మోడీ ఇంటర్నేషనల్‌ ట్రోఫీ 2024తో సుదీర్ఘ టైటిల్ నిరీక్షణకు సింధు తెరదించారు.

Show comments