NTV Telugu Site icon

Minister Roja vs Bhuvaneshwari: మీ పిల్లల మీద ప్రమాణం చేస్తారా?.. మంత్రి రోజాకు భువనేశ్వరి సవాల్!

Minister Roja

Minister Roja

Puttur Municipal Councilor Bhuvaneshwari vs Minister Roja: తిరుపతిలోని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి వివాదం రోజురోజుకు ముదురుతోంది. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి, 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు చేసిన కౌన్సిలర్ భువనేశ్వరి.. ఏకంగా సవాల్ విసిరారు. తన వద్ద డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ఆమె పిల్లల మీద ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రోజా ప్రమాణం చేస్తే.. తాను బహిరంగంగా క్షమాపణలు చెబుతానని భువనేశ్వరి అంటున్నారు.

భువనేశ్వరి చేస్తున్న ఆరోపణల ప్రకారం… పుత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 17వ వార్డు కౌన్సిలర్‌గా భువనేశ్వరి అనే మహిళ ఏకగ్రీవంగా (జనరల్ వార్డు) ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వుడ్ కావడంతో.. భువనేశ్వరికి చైర్మన్ పదవి ఇస్తానని మంత్రి రోజా హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలను తన అన్న కుమారస్వామితో మాట్లాడాలని రోజా అన్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి 70 లక్షలు ఇవ్వాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. 40 లక్షలకు బేరం కుదరగా.. రెండు దఫాలలో మొత్తాన్ని కుమారస్వామికి భువనేశ్వరి అందించారు. మున్సిపల్ ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు కావస్తున్నా.. రెండవ దఫా చైర్మన్ ఇస్తామని చెప్పిన మాట నేటికీ నెరవేర్చలేదు.

అవకాశం ఇవ్వాలని పలు దఫాలు మంత్రి రోజాను కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని కౌన్సిలర్ భువనేశ్వరి అంటున్నారు. చైర్మన్ పదవిని ఎన్నికల తర్వాత కట్టబెడతామని మాయమాటలు చెబుతున్నారని భువనేశ్వరి ఆరోపిస్తున్నారు. భువనేశ్వరి రాజకీయ కక్షతో అబద్ధాలు చేబుతోందని పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి అన్నారు. వ్యతిరేకవర్గం నేతలతో కలసి మంత్రి రోజాపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛైర్మన్ హరి మాటలకు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి మరోసారి కౌంటర్ ఇచ్చారు. తన వద్ద డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ఆమె పిల్లల మీద ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు.

Also Read: Captain Miller Reviiew: ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ రివ్యూ!

‘పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇస్తానని మంత్రి రోజా మాట ఇచ్చి ఎమార్చారు. నా దగ్గర పదవి కోసం ఒక్క రూపాయి తీసుకోలేదని రోజా ఆమె పిల్లల మీదా ప్రమాణం చేస్తారా?. డబ్బు ఇచ్చామని నేను కాణిపాకంలో ప్రమాణం చేస్తాను. మంత్రి రోజా ప్రమాణం చేస్తే.. బహిరంగంగా క్షమాపణ చెబుతాను. పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ పదవి నాకు ఇస్తామన్నారనే సంగతి నియోజకవర్గం మొత్తం తెలుసు. నేను డబ్బులు ఇచ్చిన సంగతి నియోజక వర్గంలోని అందరికీ తెలుసు. పదవి ఇస్తానంటేనే రూ.40 లక్షలను మూడు దఫాలుగా కుమారస్వామి మనిషి సత్యాకు ఇచ్చాను. డబ్బు వెనక్కి ఇవ్వమంటే 29 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పి.. 13 లక్షలే ఇచ్చారు. మిగిలిన డబ్బు కోసం కాళ్లరిగేలా తిప్పించుకున్నారు’ అని కౌన్సిలర్ భువనేశ్వరి అన్నారు.