Site icon NTV Telugu

Putin: హంగేరీకి రష్యా అధ్యక్షుడు .. పుతిన్ అరెస్టుపై అనుమానాలు?

Putin Trump Hungary

Putin Trump Hungary

ICC Arrest Warrant Putin: ప్రస్తుతం ప్రపంచం చూపు రష్యా-అమెరికాల పై ఉంది. మాస్కో-కీవ్ యుద్ధం ముగింపు కోసం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగి, విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే విషయం గురించి చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హంగేరీని తమ తదుపరి సమావేశం కోసం ఎంచుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. హంగేరీలో పుతిన్ అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

READ ALSO: Diwali: శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..

హంగేరీ పుతిన్ పర్యటిస్తే ఏం జరుగుతుంది..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు పుతిన్ హంగేరీలో సమావేశం కానున్నారు. ప్రస్తుతం ఈ హంగేరీ సమావేశంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. వాస్తవానికి 2023లో పుతిన్‌పై ICC వారెంట్ జారీ చేసింది. ఈక్రమంలో ఆయన హంగేరీకి చేరుకున్న తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వారెంట్‌లో యుద్ధ నేరాల ఆరోపణలపై పుతిన్‌ను అరెస్టు చేయాలని ప్రకటించింది. అయితే ICCకి ఎటువంటి అరెస్టు అధికారం లేదు, ఎందుకంటే దానికి పోలీసు దళం లేదా ఏజెన్సీ లేదు. ICC అరెస్ట్ వారెంట్లను అమలు చేయడం ప్రధానంగా దాని సభ్య దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుంది. కానీ హంగేరీలో పుతిన్ అరెస్ట్ సాధ్యపడక పోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

హంగేరీ, దాని పొరుగు దేశాలు సెర్బియా, రొమేనియాతో సహా పలు దేశాలు రష్యా అధ్యక్షుడి విమానం వారి గగనతలంలోకి ప్రవేశిస్తే పుతిన్‌ను అరెస్టు చేయడానికి సాంకేతికంగా బాధ్యత వహిస్తాయి. ఎందుకంటే ఈ దేశాలు ICCలో సభ్య దేశాలుగా ఉన్నాయి. జర్మనీ ఇప్పటికే పుతిన్‌ను అరెస్టు చేయాలని హంగేరీని కోరింది. అయితే పుతిన్‌ను చేతికి సంకెళ్లు వేసి కటకటాల వెనుక చూడటం అనేది సుదూర కలగానే మిగిలిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 1998 ICC ని స్థాపించిన రోమ్ శాసనంపై హంగేరీ సంతకం చేసింది. అయితే ఇటీవల ఈ దేశ ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ ICC నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ICC నుంచి హంగేరీ బయటికి రావడానికి చర్యలు ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. కానీ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఒక ఏడాది పడుతుంది. అందువల్ల ఇప్పటికీ హంగేరీ సాంకేతికంగా పుతిన్‌ను అరెస్టు చేయగలదు.

రష్యా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తారా?
ఇది చాలా అసంభవం అని చెబుతున్నారు. ఎందుకంటే విక్టర్ ఓర్బన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దీర్ఘకాల మిత్రుడు మాత్రమే కాదు, రష్యాతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. యుద్ధ నేరాలకు పాల్పడిన మరో నాయకుడు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఏప్రిల్ పర్యటనను ఉటంకిస్తూ హంగేరీ పుతిన్‌కు తన భద్రతను హామీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఓర్బన్.. ట్రంప్ – పుతిన్ ఇద్దరితో మాట్లాడి ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి “యూరప్‌లో అలాంటి సమావేశం నిర్వహించగల ఏకైక ప్రదేశం బుడాపెస్ట్” అని ఓర్బన్ పేర్కొన్నారు. దేశంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఓర్బన్‌కు, అధిక ఆహార ధరలు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ కారణంగా ఏర్పడిన దేశీయ ఒత్తిళ్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం అవకాశాన్ని అందిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే.. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే, లైబీరియన్ మాజీ అధ్యక్షుడు చార్లెస్ టేలర్‌తో సహా కొంతమంది నాయకులు మాత్రమే ICCకి లొంగిపోయారని తెలుస్తుంది.

నాలుగేళ్ల తర్వాత మొదటి పర్యటన కానుంది..
ట్రంప్‌ను కలవడానికి పుతిన్ హంగేరీకి వెళ్లడానికి అంగీకరిస్తే, దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత EU దేశానికి ఆయన చేసిన మొదటి పర్యటన అవుతుంది. అయితే బుడాపెస్ట్‌కు వెళ్లడం పుతిన్‌కు ప్రమాదకరం అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ICC అరెస్ట్ వారెంట్ తర్వాత పుతిన్ తన అంతర్జాతీయ ప్రయాణాన్ని పరిమితం చేసుకున్నారు. ఆగస్టులో ట్రంప్‌తో జరిగిన సమావేశం కోసం పుతిన్ అలాస్కాకు వెళ్లడానికి విమానంలో ప్రయాణించడం సులభతరం చేసింది. కానీ తాజా పర్యటనలో బుడాపెస్ట్‌కు వెళ్లాలంటే ప్రత్యక్ష మార్గం.. రష్యా శత్రు దేశాల గగనతలం గుండా వెళుతుంది. మాస్కోపై EU ఆంక్షల కారణంగా, రష్యన్ విమానాలు హంగేరీతో సహా EU సభ్య దేశాల గగనతలంలో దిగడం, టేకాఫ్ చేయడం నిషేధించారు. కానీ ఈ నిషేధాలపై EU సభ్య దేశాలు నిరంతరం మినహాయింపులు ఇచ్చాయి.

మాస్కో నుంచి బుడాపెస్ట్‌కు వెళ్లడానికి దాదాపు మూడు గంటలు పడుతుంది. ఈ మార్గం బెలారస్, పశ్చిమ ఉక్రెయిన్ గుండా ఉంది. వాస్తవానికి ఇది అత్యంత ప్రమాదకరమైనదని చెబుతున్నారు. ఉక్రేనియన్ గగనతలంపై రష్యా విమానాలు ప్రయాణించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే యుద్ధ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం గుండా పుతిన్ విమానాలు ప్రయాణిస్తే దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరొక అవకాశం ఏమిటంటే.. స్లోవేకియా ద్వారా హంగేరీకి చేరుకునే ముందు పుతిన్ బెలారస్, పోలాండ్ మీదుగా ఐదు గంటలు ప్రయాణించాల్సి ఉంది.

హంగేరీకి వెళ్లడానికి అత్యంత ఆచరణాత్మకమైన మార్గంగా టర్కీని సూచిస్తున్నారు. మాస్కో నుంచి టర్కీ గుండా 8 గంటల ప్రయాణం చేస్తే హంగేరీకి చేరుకోవచ్చు. ఇది రష్యా, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉంది. తరువాత గ్రీస్ మీదుగా విమానంలో ప్రయాణించి, మధ్యధరా, అడ్రియాటిక్ సముద్రాలను దాటి, హంగేరీ చేరుకుంటుంది. అప్పుడు పుతిన్ ఉత్తరం వైపు వెళ్లి, ICC, NATO మిత్రదేశమైన మోంటెనెగ్రో గుండా వెళ్లి, ఆపై సెర్బియాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ, సెర్బియా ఐరోపాలో రష్యాకు ఉన్న కొన్ని మిత్రదేశాలలో ఒకటిగా చెబుతారు. నిజానికి, నెతన్యాహు గత నెలలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) కోసం న్యూయార్క్‌కు వెళ్లినప్పుడు అనేక యూరోపియన్ దేశాలను తప్పించుకుంటూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. దీంతో పుతిన్‌కు కూడా హంగేరీకి వెళ్లడానికి మంచి మార్గంగా దీనిని సూచిస్తున్నారు.

READ ALSO: Ayyappa Mala: అయ్యప్ప స్వాములు పాటించే నియమాలు ఏంటో తెలుసా..

Exit mobile version