NTV Telugu Site icon

MLA MS Babu: సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే.. మీరు చెప్పిందే చేశా.. నా తప్పంటే ఎలా?

Mla Ms Babu

Mla Ms Babu

MLA MS Babu: ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన మార్పులు, చేర్పులపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. ఇక, తమకు సీటు దక్కడం ఖాయమని భావించిన కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, నేతలు.. పక్క పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతుండగా.. మరికొందరు పార్టీ అధినేతపై కూడా ఫైర్‌ అవుతున్నారు.. ఇప్పుడు చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. నేను చేసినా తప్పు ఎంటో జగన్ చెప్పాలి? అని నిలదీశారు. ఐదేళ్లుగా ఎప్పుడైనా వైఎస్‌ జగన్ ఒక్కసారి అయినా మమ్మల్ని పిలిచి మాట్లాడారా..? అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్ చెప్పకముందే నేను నియోజకవర్గంలో గడపగడపకు తిరిగానన్న ఆయన.. దళితులకు జగన్ ఏమి న్యాయం చేశారు..? దళిత ఎమ్మెల్యేలు అంటే చిన్నాచూపా..? అంటూ మండిపడ్డారు.

Read Also: Top Headlines @ 1 PM : టాప్‌ న్యూస్‌

ఇక, సీఎం వైఎస్‌ జగన్ చెప్పిందే చేశాను.. ఇప్పుడు నా తప్పంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బాబు.. గత ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ పెద్దలు, మంత్రులు చెప్పినట్టే నడుచుకున్నా .. ఇప్పుడు నాపై వ్యతిరేకత ఉంటే ఎవరిది భాద్యత ? అని ప్రశ్నించారు. ఐప్యా క్ సర్వేలో తనకు అనుకూలంగా లేదని.. ఈ దఫా పూతలపట్టు టికెట్ ఆశించవద్దని సీఎం జగన్ చెప్పడం తగదన్నారు. డబ్బులు ఇస్తే ఐఫ్యాక్ వాళ్ళు సర్వే ఫలితాలు ఎలాగైనా మారుస్తారని ఆరోపించారు. గత ఎన్నికలలో ఐఫ్యాక్ సర్వే ఇస్తేనే నాకు టికెట్ ఇచ్చారా..? అని నిలదీశారు. పార్టీలో టికెట్ల విషయంలో దళితులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై నమ్మకం ఉంది. పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గౌరవం ఉంది.. ఆయన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఓసీ సీట్లు ఒక్కచోటా మార్చకుండా.. కేవలం ఎస్సీ సీట్లే మార్చారు.. తిరుపతి, చిత్తూరు జిల్లా ఓసీ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉన్న మార్చాలేదు అంటూ దుయ్యబట్టారు పూతలపట్టుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు.