NTV Telugu Site icon

Adivasi Festival : మహిళ సాహసం.. రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి..!

Adivasi Festival

Adivasi Festival

Adivasi Festival : పుష్యమాసం పౌర్ణమి వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లా సంప్రదాయాలకు పునాదులు వేసిన ఆదివాసీ సంస్కృతి మరోసారి పుంజుకుంటుంది. ఈ జిల్లా అడవుల్లో ప్రతి క్షణం ఆధ్యాత్మిక శోభను చాటి చెప్పే అనేక జాతరలు నిర్వహించబడతాయి. అవి సాహసాలకు, సంప్రదాయాలకు, ఆచారాల పరిరక్షణకు నిలయంగా నిలుస్తాయి. ఇందులోని తొడసం తెగ వారు తమ ఆరాధ్యదైవం ఖందేవుని మహాపూజను అత్యంత ఘనంగా నిర్వహిస్తూ తమ వంశం సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు.

పుష్యమాసం పౌర్ణమి రోజున ఖందేవుని మహాపూజ నిర్వహించడం తొడసం వంశీయుల ఆచారం. నార్నూర్ మండల కేంద్రంలోని ఖందేవు ఆలయంలో సోమవారం రాత్రి ఈ మహాపూజ జాతర ప్రారంభమైంది. ముందుగా, నెల రోజుల కిందటే ఈ మహాపూజ కోసం ప్రతి ఇంటిలో నువ్వుల నూనె తయారు చేయడం ప్రారంభమవుతుంది. అలా ప్రతీ ఇంటినుంచి తీసుకువచ్చిన నువ్వుల నూనెను దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తరువాత.. తొడసం వంశానికి చెందిన ఆడపడుచు తాగి మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Sabarimala: శబరిమలలో మకరజ్యోతి దర్శనం… అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన శబరిగిరులు

ఈ సంవత్సరం కూడా సోమవారం అర్ధరాత్రి ఈ జాతర ప్రారంభమై, మంగళవారం ఉదయం ఖందేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొడసం వంశానికి చెందిన నాగుబాయి చందు అనే మహిళ మొత్తం వంశం నుంచి సేకరించిన రెండున్నర కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకున్నారు. అయితే.. ఇలా మొక్కు తీర్చుకోవడం ద్వారా సంతాన యోగం కలుగుతుందని, కుటుంబ శ్రేయస్సు సాధిస్తుందని నమ్ముతారు.

తొడసం వంశస్థులు పుష్యమాసంలో మాన్కాపూర్ గ్రామంలో మాసేమాల్ పేన్ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి ఈ పూజలు జరిపి, సోమవారం రాత్రి నాలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన తొడసం వంశీయులు ఖందేవు క్షేత్రానికి చేరుకున్నారు. ఇక్కడ ఖందేవుని పుష్య పౌర్ణమి పూజలతో పాటుగా సంప్రదాయ మొక్కులు చెల్లించి, తమ కట్టుబాట్లకు గౌరవం చాటుకున్నారు. జాతర సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు ఖందేవు క్షేత్రానికి వచ్చారు. తొడసం వంశస్థులు వీరికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజల నిర్వహణలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణపై చర్చించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వంశీయులు సంప్రదాయ భేటీ నిర్వహించి, ఆలయ అభివృద్ధికి అనుసరించాల్సిన కార్యాచరణను తీర్మానించారు.

జాతర సందర్భంగా తొడసం వంశీయులు ఆలయ ఆవరణలో మినీ ప్రజాదర్బార్ నిర్వహించారు. వంశీయులు తమ సమస్యలను వివరించి, అవి పరిష్కరించేందుకు అధికారులతో చర్చించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. పుష్యమాస పౌర్ణమి రోజున ఖందేవుని పూజలతో ఆదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సంపద వెలుగొందింది. వంశీయుల కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ఈ ప్రాంతంలోని ఆదివాసీ జీవన విధానానికి నిదర్శనం. ఆదివాసీ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, వారి ఆధ్యాత్మికతకు గౌరవం ఇచ్చే ఈ మహాజాతర, ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

CM Chandrababu: ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే నా లక్ష్యం..

Show comments