NTV Telugu Site icon

Viral Video: ‘సూపర్ ఉమెన్’.. ముగ్గురు దొంగలను ఒంటిచేత్తో అడ్డుకుంది! వీడియో వైరల్

Super Woman

Super Woman

భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా.. అన్ని బాధ్యతల్నీ ఓ మహిళ ఒంటిచేత్తో సమన్వయం చేసుకుంటుంది. అలానే ఏదైన ఆపద వచ్చినా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఎంతోమంది మహిళలు తమ కుటుంబం కోసం అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించడం మనం చూశాం. తాజాగా పంజాబ్‌కు చెందిన ఒక మహిళ ఇంట్లో దొంగతనికి వచ్చిన ముగ్గురు దుండగులను అడ్డుకుంది. ఆ మహిళ ధైర్యం, బలం ముందు ఆ దొంగలు ఏమీ చేయలేకపోయారు. చివరికి ఆ దొంగలు పారిపోవాల్సి వచ్చింది.

వివరాల ప్రకారం… అమృత్‌సర్‌లోని వెర్కా ప్రాంతంలో జగ్జిత్ సింగ్‌ అనే నగల వ్యాపారి నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య మండూప్ కౌర్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జగ్జిత్ ప్రతిరోజు ఉదయాన్నే తన బంగారం షాపుకి వెళుతాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మండూప్ తన పిల్లలతో కలిసి ఇంట్లో ఉంది. ఆయుధాలతో ముగ్గురు దొంగలు గోడ దూకి ఇంటి లోపలికి రావడాన్ని ఆమె గమనించింది. ఆమె వెంటనే అప్రమత్తమైన మండూప్.. అన్ని గదులకు తాళం వేసింది. పిల్లలను మరో గదిలో ఉంచింది.

ముగ్గురు దుండగులు ఇంటి ప్రధాన ద్వారం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. లోపల నుంచి మండూప్ కౌర్ తలుపు మూయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. అవతలి నుంచి ముగ్గురు దొంగలు ఎంత ప్రయత్నం చేసినా.. ఆమె వెనకడుగు వేయలేదు. దాదాపు 10-15 నిమిషాల పాటు దొంగలను అడ్డుకుంది. చివరకు తలుపు మూసి.. పక్కనే ఉన్న సోఫాను అడ్డుగా పెట్టింది. దాంతో దొంగలు లోపలికి ప్రవేశించలేకపోయారు. మండూప్ గట్టిగా అరవడమే కాకుండా.. ఇరుగుపొరుగు వారికి కాల్ చేసింది. దాంతో దుండగులు అక్కడినుంచి పారిపోయారు.

Also Read: IND vs NZ: టిమ్‌ సౌథీ షాకింగ్‌ డెసిషన్.. టీమిండియాతో టెస్టు సిరీస్‌కు కెప్టెన్ ఎవరంటే?

సమాచారం అందుకున్న జగ్జిత్ సింగ్‌ ఇంటికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మండూప్ కౌర్ చేసిన ధైర్యసాహసాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిన ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సూపర్ ఉమెన్’ అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments