Site icon NTV Telugu

Fraud: పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండంటూ.. వందల కోట్లకు కుచ్చుటోపీ

Pig Business

Pig Business

Fraud: ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకుంటున్న కేటుగాళ్లు వారిని ముంచి తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మాయమాటలనే గాలం వేసి తమ ఉచ్చులోకి లాగేసుకుంటున్నారు. గతంలో పలు పెట్టుబడి పేర్లు చెప్పి ఎందరో కేటుగాళ్లు సొమ్ము చేసుకున్న ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా పంది పిల్లల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అంటూ ఓ కేటుగాడు.. రూ.వందల కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు. పంది పిల్లల వ్యాపారంలో పెట్టబడి పెట్టి 7 నెలల్లో 1.5 రెట్ల డబ్బును పొందండంటూ నమ్మబలికి పలువురిని మోసం చేశాడు. ఈ వ్యవహారంపై పలు రాష్ట్రాల్లో గత మూడేళ్లుగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పంజాబ్‌లోని ఫిరోజ్‌ నగర్‌కు చెందిన మంగత్‌రాం మైనీ అనే వ్యక్తి అధిక రాబడుల పేరుతో భారీ మొత్తాలను వసూలు చేసి మోసగించాడు.

Gujarat Elections: భారత్‌ జోడో యాత్రకు బ్రేక్‌.. నేడు గుజరాత్‌లో రాహుల్ పర్యటన

రూ.10 వేల విలువైన 3 పంది పిల్లలను కొనుగోలు చేసి పెంచితే విదేశాల్లో వాటి మాంసానికి ఉన్న గిరాకీ వల్ల 7 నెలల్లోనే రూ.40 వేలు వస్తాయంటూ నమ్మబలికాడు. ఏడు నెలలు కాగానే రూ.15 వేలు ఇస్తానని.. మిగిలిన రూ.25వేలను వారానికి రూ.500 చొప్పున 30 వారాల పాటు చెల్లిస్తానంటూ అందరిని నమ్మబలికి ఆకర్షించాడు. ఆకర్షితులైన పలువురు రూ.10,000 నుంచి రూ.2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. రక్షణరంగ ఉద్యోగి ఒకరు రూ.25 లక్షలు సమర్పించేశారు. ఇలా దాదాపు రూ. 500 కోట్లు వసూలు చేసి కొన్ని వారాలపాటు బాగానే చెల్లించిన మైనీ, తర్వాత బోర్డు తిరగేశాడని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ మోసంపై ఢిల్లీతో పాటు పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో కేసు నమోదు కావడం గమనార్హం. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

Exit mobile version