NTV Telugu Site icon

PBKS vs RR: రాజస్థాన్‌, పంజాబ్‌ జట్ల మధ్య కీలక మ్యాచ్.. ఓడితే ఇంటికే.

Pbks Vs Rr

Pbks Vs Rr

PBKS vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో 66వ గేమ్‌లో భాగంగా శుక్రవారం (మే 19) ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. రెండు జట్లకు ఇది చివరి గ్రూప్ స్టేజ్ గేమ్. పంజాబ్‌ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన 13 గేమ్‌లలో ఆరింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. రాజస్థాన్‌ రాయల్స్ 13 మ్యాచ్‌లలో ఆరు గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ గేమ్ ఫలితం పంజాబ్‌ కింగ్స్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించే అవకాశాలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. రాజస్థాన్‌ గెలిచినా కూడా ప్లేఆఫ్‌కు అర్హత ఉండదు. ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలిచినా కేవలం 14 పాయింట్లను మాత్రమే పొందగలరు. గత మ్యాచ్‌ పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఓటమిని చవిచూసింది. రెండు జట్లు 6 విజయాలతో ఉండగా.. ఇవాళ ఓడే జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతుంది. గెలిచిన జట్టు పలు మ్యాచ్‌లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో సీఎస్కే, లక్నో, ముంబయి, ఆర్సీబీ జట్లు ఓడితే ఇవాళ గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్‌కు అవకాశం లభిస్తుంది. అది సాధ్యం కానీ విషయమే.

పంజాబ్‌ కింగ్స్ గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడింది. ఇక్కడ పంజాబ్‌ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో డీసీ రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, పృథ్వీ షాల జోడీ తొలి వికెట్‌కు 94 పరుగులు జోడించగా.. జట్టు అత్యధిక స్కోరు సాధించడంలో టాప్ ఆర్డర్ కీలక పాత్ర పోషించింది. పృథ్వీ షా 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు. రిలీ రోస్సో తన అత్యుత్తమ బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. రిలీ రోస్సో 37 బంతుల్లో 82 పరుగులు చేశాడు. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌ శిఖర్ ధావ రెండో ఓవర్‌లోనే డకౌట్‌గా వెనుదిరిగాడు. అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్ అర్ధ సెంచరీలు చేశారు. లివింగ్‌స్టోన్ 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు, ఇది ఐపీఎల్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు. కానీ, పీబీకేఎస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలగడంతో లక్ష్యాన్ని 15 పరుగుల తేడాతో చేజార్చుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును రోస్సో గెలుచుకున్నాడు.

Read Also: Different Weather: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితి.. ఎండలు.. వానలు..

అంతకుముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌లోని తమ సొంత మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్ ఇబ్బందికరమైన ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాఫ్‌ డు ప్లెసిస్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీల సాయంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చి రాజస్థాన్‌ జట్టు 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే ఆలౌటైంది. కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఐపీఎల్‌లో రాజస్థాన్, పంజాబ్‌ జట్లు 25 మ్యాచ్‌లలో తలపడగా.. 14 మ్యాచ్‌లలో రాజస్థాన్‌ జట్టు విజేతగా నిలిచింది. అయితే పంజాబ్‌ జట్టు మిగిలిన 11 గేమ్‌లలో విజయాన్ని సాధించింది. వారి ఇటీవలి మ్యాచ్‌లలో రాజస్థాన్‌ జట్టు మునుపటి ఐదు గేమ్‌లలో మూడింటిని గెలిచి పైచేయి సాధించింది. ఈ జట్లు తలపడిన తాజా మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజేతగా నిలిచింది.