Site icon NTV Telugu

Preity Zinta: సురక్షితంగా ఇంటికి చేరుకున్నా.. అభిమానులకు క్షమాపణలు!

Preity Zinta

Preity Zinta

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాక్ వరుస క్షిపణి, డ్రోన్ దాడులను చేయగా.. దీనికి భారత సైన్యం దీటైన సమాధానం ఇచ్చింది. అయితే మే 8న జరిగిన దాడుల కారణంగా ధర్మశాలలో ఐపీఎల్ 2025 మ్యాచ్ కూడా ప్రభావితమైంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలో ఆపేసి.. రద్దు చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ ప్రీతి జింటా కూడా ధర్మశాల స్టేడియంలో ఉన్నారు.

మ్యాచ్ రద్దైన తర్వాత ప్రేక్షకులందరూ వెంటనే స్టేడియం వదిలి వెళ్లిపోవాలని ఐపీఎల్ అధికారులు కోరారు. అభిమానులను స్టేడియం వదిలి వెళ్లాలని ప్రీతి జింటా స్వయంగా విజ్ఞప్తి చేశారు. మైదానంలోకి వచ్చి కొందరిని బయటికి పంపించారు. అదే సమయంలో స్టేడియంలో ఉన్న ఇరు జట్ల ఆటగాళ్ల విషయంలో ఆందోళన చెందిన ప్రీతి.. తమను సురక్షిత ప్రాంతానికి చేర్చాలని బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వెంటనే భారత రైల్వేశాఖ సహాయంతో ధర్మశాల నుండి ఢిల్లీకి ప్రత్యేక వందే భారత్ రైలును బీసీసీఐ ఏర్పాటు చేసింది. అందరినీ సురక్షితంగా చేర్చినందుకు బీసీసీఐ, ఐపీఎల్ అధికారులందరికీ ప్రీతి కృతజ్ఞతలు చెప్పారు. తాను ఇప్పుడు క్షేమంగా ఉన్నానని, ఫైనల్లీ ఇంటికి చేరుకున్నానని ఓ పోస్ట్ చేశారు.

‘గత కొన్ని రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాను. ఐపీఎల్ జట్లు, అధికారులు, కుటుంబాలు ధర్మశాల నుండి సురక్షితంగా ఢిల్లీ చేరడానికి సహాయం చేసినందుకు భారత రైల్వే, రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు సాయపడిన జై షా, అరుణ్ ధుమాల్, బీసీసీఐ, శ్రీ సతీష్ మీనన్ సహా పంజాబ్ ఆపరేషన్స్ బృందానికి థాంక్స్. భయపడకుండా మైదానం నుంచి బయటికి వెళ్లిన అభిమానులకు ధన్యవాదాలు. తొక్కిసలాట జరగనందుకు చాలా సంతోషం. మీరు నిజంగా రాక్ స్టార్స్. అయితే అందరితో ఫోటోలు దిగడానికి నో చెప్పినందుకు క్షమించండి. ఆ సమయంలో అందరి భద్రత అవసరం. అందరూ సురక్షితంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత. లవ్ యూ ఆల్’ అని ప్రీతి జింటా ట్వీట్ చేశారు. ఐపీఎల్ 2025 మే 15 లేదా 16న పునఃప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

 

Exit mobile version