NTV Telugu Site icon

Pune: బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. 15 గంటల్లో బెయిల్.. కోర్టు ఏం చెప్పిందంటే..!

Accide

Accide

మహారాష్ట్రలోని పూణెలో జరిగిన రోడ్డుప్రమాదంపై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆశ్చర్యం కలిగించింది. బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరి మృతికి కారణమైన బాలుడికి 15 గంటల్లోనే బెయిల్ లభించడం విశేషం. పైగా ప్రమాదంపై వ్యాసం రాయమని పూణె కోర్టు ఉచిత సలహా ఇచ్చింది. ఈ తీర్పు మేధావుల్ని ఆశ్చర్యం గొల్పించింది.

పూణెలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కారు డ్రైవ్‌ చేసిన నిందితుడు ఓ మైనర్‌ అని తేల్చారు. దీంతో అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ కేసులో ఆ బాలుడికి జువైనల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇందుకు కొన్ని షరతులు విధించింది.

ఇది కూడా చదవండి: Fish Prasadam : జూన్‌ 8న ‘చేప ప్రసాదం’

15 రోజులు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలని.. అలాగే ప్రమాదంపై ఒక వ్యాసం రాయాలని సూచించింది. అంతేకాకుండా మద్యపానంపై చికిత్స చేయించుకోవాలని.. కౌన్సెలింగ్ కూడా తీసుకోవాలని ధర్మాసనం ఉచిత సలహా ఇచ్చింది. భవిష్యత్‌లో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే బాధితులకు సాయం చేయాలని సూచించింది. నిందితుడిని మేజర్‌గా పరిగణించి దర్యాప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా.. న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. బెయిల్‌ నిరాకరించడానికి కారణాలు కనిపించడం లేదని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. నిందితుడు పూణెకు చెందిన ప్రముఖ రియల్టర్ కుమారుడు కావడం విశేషం.

ఇటీవలే 12వ తరగతి పూర్తి చేసిన ఆ బాలుడు.. శనివారం తన స్నేహితులతో కలిసి పోర్షే కారులో పబ్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం కూడా సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆదివారం తెల్లవారుజామున 2:15 గంటలకు పబ్‌ నుంచి తిరిగి వస్తుండగా వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల స్వస్థలం రాజస్థాన్‌ అని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: AP Violence: డీజీపీని కలిసిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్.. అల్లర్లపై నివేదిక అందజేత