NTV Telugu Site icon

Pune Porsche Crash Case: పుణె కారు ప్రమాదం కేసులో డాక్టర్ క్రిమినల్‌ నెట్‌వర్క్‌..!

Pune Case

Pune Case

Pune Porsche Crash Case: మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనరు (17) నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందిన కేసు దర్యాప్తులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. రక్త నమూనా మార్పిడికి పాల్పడిన డాక్టర్‌ వెనుక పెద్ద క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని వెల్లడైంది. తాజాగా, సదరు డాక్టర్ కు నిందితుడి తండ్రి విశాల్‌ అగర్వాల్‌ ఏకంగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ప్రాంగణంలోనే రూ.4 లక్షలు లంచం చెల్లించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను కూడా పోలీసులు సేకరించారు. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ఈ డబ్బు తీసుకున్నట్లు ససూన్‌ ఆస్పత్రి ప్యూన్‌ అతుల్‌ ఘాల్‌కాంబ్లే అనే వ్యక్తి వచ్చి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, మధ్యవర్తికి విశాల్‌ అగర్వాల్‌ డ్రైవర్‌ రూ. 4 లక్షలు ఇవ్వగా.. అందులోంచి రూ.3 లక్షలను డాక్టర్ అతుల్‌కు చెల్లించినట్లు తెలిపారు. ఇక, పోలీసులు ఇప్పటికే ఆస్పత్రి ప్యూన్‌ తో పాటు విశాల్‌ అగర్వాల్‌ దంపతులు, ఈ వ్యహారానికి మధ్యవర్తిగా వ్యవహరించిన అష్ఫాక్‌ మకాన్‌దార్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

ఇక, ససూన్‌ ఆస్పత్రిలోని ఫోరెన్సిక్‌ విభాగం పని తీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ విభాగం అధిపతి డాక్టర్‌ అజేయ్‌ తావ్‌డే గతంలో కూడా పలు కేసుల్లో ఇలానే రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు వచ్చాయని పుణె క్రైం బ్రాంచ్‌ అధికారులు వెల్లడించారు. నిందితుల రక్తనమూనాలు మార్చేయడం ఈ మూఠాకు ఇదే తొలిసారి కాదన్నారు. అతడికి సంబంధించిన డాక్టర్లు, బ్రోకర్ల నెట్‌వర్క్‌ పుణె చుట్టు పక్కలతో పాటు పశ్చిమ మహారాష్ట్రలోని నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు గుర్తించారు. ఏదైనా హైప్రొఫైల్‌ కేసుల బారిన పడిన కుటుంబాలను ఈ నెట్‌వర్క్‌ సభ్యులు సంప్రదించి.. వారికి స్వల్ప శిక్షలు పడేట్లు చేస్తారన్నారు. దాదాపు రెండేళ్ల నుంచి ఈ నెట్‌వర్క్‌ చురుగ్గా పని చేస్తున్నట్లు పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.