NTV Telugu Site icon

Pune Porsche crash: నిందితుడి మెడికల్ రిపోర్టు మార్చిన వైద్యులపై వేటు

Ae

Ae

పూణె యాక్సిడెంట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాలు మరిన్ని సంచలనాలకు దారి తీసింది. నిందితుడికి గంటల్లో బెయిల్ రావడం.. అనంతరం మెడికల్ రిపోర్టులు మార్చడం.. ఇలా ఒక్కో వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ కేసులో నిందితుడి రక్త నమూనాలు మార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిపై వేటు పడింది. డాక్టర్‌ శ్రీహరి హల్నోర్‌ను సాసూన్‌ జనరల్‌ ఆస్పత్రి నుంచి తొలగించారు. అతడిని సర్వీసు నుంచి పూర్తిగా డిస్మిస్‌ చేసినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చి ఆఫ్‌ మహారాష్ట్ర ప్రకటించింది. దీంతో పాటు ఈ కేసులో ఉన్న ఫోరెన్సిక్‌ విభాగం అధిపతి డాక్టర్‌ తావ్‌డేపైనా సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇప్పటికే వైద్యులు శ్రీహరి హల్నోర్‌, తావ్‌డేతోపాటు ఒక గుమస్తాను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ప్రమాదం జరిగిన రోజు డాక్టర్‌ తావ్‌డే, నిందితుడి తండ్రి ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్త నమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్‌ కుదిరింది. ఈ నేపథ్యంలోనే తావ్‌డే తన ప్లాన్‌ను వివరించాడు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే డాక్టర్‌ నమూనాలను ఆ స్థానంలో పెడతామని వెల్లడించాడు. వైద్య పరీక్షల్లో ఆల్కహాల్‌ ఆనవాళ్లు బయటపడ కూడదనే ఇలా చేశారు. ఈ వ్యవహారంలో డబ్బులు తీసుకొచ్చిన గుమస్తా విచారణ సందర్భంగా ఒక దశలో ఆవేశంతో నిజాన్ని ఒప్పేసుకున్నాడు.

ఇక నిందితుడికి వెంటనే బెయిల్ రావడంతో జువైనల్‌ బోర్డుపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం బృందాన్ని ఏర్పాటు చేసింది. యాక్సిడెంట్ కేసు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ఎదుటకు రాగానే 300 పదాలతో వ్యాసరచన చేయమనడం, 15 గంటలు ట్రాఫిక్‌ పోలీసులకు సాయం.. తదితర నిబంధనలతో తక్షణమే బెయిల్‌ ఇచ్చేసింది. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. దీంతో తిరిగి నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు, డాక్టర్లు నిందితుడికి సాయం చేసినట్లు తేలడంతో.. ఇప్పుడు జువైనల్‌ బోర్డుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపడింది. దీంతో ఐదుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇది విచారణ జరిపి వచ్చే వారం మహిళా శిశు అభివృద్ధి శాఖకు నివేదికను సమర్పించనుంది.