Fake Pregnant Job Scam: పూణేకు చెందిన 44 ఏళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను చూశాడు. అది అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ వీడియోలో ఒక మహిళ లోతైన స్వరంతో “నన్ను తల్లిని చేసే పురుషుడు కావాలి. నేను అతనికి 2.5 మిలియన్ రూపాయలు(రూ.25 లక్షలు) ఇస్తాను. అతని కులం, రంగు లేదా విద్యతో నాకు పట్టింపు లేదు “అని చెబుతోంది. ఈ వీడియోను ” గర్భిణీ ఉద్యోగం ” అనే పేజీలో పోస్ట్ చేశారు. ఆ కాంట్రాక్టర్ మొదట్లో ఇది వింతగా భావించాడు. కానీ రూ.25 లక్షలు ఆఫర్‌తో ఆకర్షితుడై.. వెంటనే వీడియోలో ఇచ్చిన నంబరుకు ఫోన్ కొట్టాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వ్యక్తి తాను ” ప్రెగ్నెంట్ జాబ్ ” అనే కంపెనీకి అసిస్టెంట్‌గా పరిచయం చేసుకున్నాడు. ఈ ఉద్యోగం కోసం తాను మొదట కంపెనీలో రిజిస్టర్ చేసుకోవాలని.. అనంతరం ఐడీ కార్డు, ఇతర అవసరమైన పత్రాలు ఇస్తామని కాంట్రాక్టర్‌తో చెప్పాడు. ఇక్కడే అసలు ఆట మొదలైంది. మొదట రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆ తర్వాత ఐడీ కార్డు ఛార్జీలు, వెరిఫికేషన్, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజులు అంటూ డబ్బులు గుంజడం ప్రారంభించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఆ కాంట్రాక్టర్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ 23 వరకు 100కి పైగా ఆన్‌లైన్ బదిలీలు చేశాడు. కొన్నిసార్లు UPI, కొన్నిసార్లు IMPS ద్వారా మొత్తం సుమారు 11 లక్షల రూపాయలు పంపాడు. డబ్బు దండుకున్న గుర్తు తెలియని వ్యక్తి.. మొదట్లో తన ఐడీ ప్రాసెసింగ్‌లో ఉందని చెప్పాడు. త్వరలోనే ఆ మహిళను తీసుకొచ్చి తన దగ్గరకు వస్తానని హామీ ఇచ్చాడు. నెమ్మదిగా కళ్లు తెరుచుకున్న కాంట్రాక్టర్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. దీంతో అవతలి వ్యక్తి నుంచి వచ్చిన సమాధానాలను బట్టి తాను మోసపోయానని గ్రహించిన కాంట్రాక్టర్ బనేర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డబ్బు బదిలీ చేసిన మొబైల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల సమచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసం కేవలం పూణేకే పరిమితం కాదని.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ వీడియోలను పోస్ట్ చేసి.. డబ్బు ప్రకటనలతో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆపై వేర్వేరు ఛార్జీల పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. 2022 చివరి నుంచి అనేక రాష్ట్రాల్లో ఇటువంటి మోసపూరిత వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని సైబర్ దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చాలా మంది ఈ విధంగా మోసపోయారు.
READ MORE: Starlink: భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ లింక్.. శాటిలైట్ ఇంటర్నెట్ ట్రయల్స్ ప్రారంభం
