NTV Telugu Site icon

AAP vs BJP: ఎంసీడీలో ముదిరిన కొట్లాట.. జై మోదీ, జై కేజ్రీవాల్‌ అంటూ కొట్టుకున్న కార్పొరేటర్లు

Aap Vs Bjp

Aap Vs Bjp

AAP vs BJP: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. కీలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరుకు దారితీసింది. ఒక్క ఓటు చెల్లకుండా పోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో అత్యంత శక్తివంతమైన సంస్థగా భావించే స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితం చెల్లని ఓటు లేకుండానే ప్రకటించబడుతుందని మేయర్ పట్టుబట్టారు. ఈ నిర్ణయంతో సభలో పోరాటాలు జరిగాయి. ఎన్నికైన కౌన్సిలర్లు ఒకరినొకరు కొట్టుకోవడం, తన్నడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య వాగ్వాదం కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రద్దయ్యాయి. ఘర్షణ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ అశోక్ కుమార్ మాను ఢిల్లీ సివిక్ సెంటర్‌లో కుప్పకూలారు. బీజేపీ గూండాల వల్ల ఈ గొడవ జరిగిందని ఆరోపించారు. ‘మహిళలు, మేయర్‌పై కూడా దాడి చేసేంత సిగ్గులేని వారు.. బీజేపీ గూండాలు ఈ పని చేశారు’ అని మాను అన్నారు. ఈ సభలో ఆప్, బీజేపీ నేతలు టేబుల్స్‌పైకి ఎక్కి నినాదాలు చేశారు. దీంతో, ఆ ప్రాంతంలో రసాభాస జరిగింది.

మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు చెల్లదంటూ మేయర్‌ షెల్లీ ఒబెరాయ్‌ ప్రకటించడంతో సభలో బాహాబాహీ జరిగింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. సభలో తన్నుకోవడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. కౌన్సిలర్లను అడ్డుకున్నారు. కొందరు బీజేపీ కౌన్సిలర్లు మీకు తెలివి లేదంటూ ఆమెపై అరిచారు. “స్థాయీ సంఘం ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని గ్రహించిన వెంటనే, అది మా మేయర్‌పై దాడి చేసింది. షెల్లీ ఒబెరాయ్ తనను తాను రక్షించుకోవడానికి హౌస్ నుండి బయటకు పరుగెత్తాల్సి వచ్చింది. బీజేపీకి చెందిన మగ కౌన్సిలర్లు ఆమెపై భౌతిక దాడి చేశారు. బీజేపీ ఓటమిని అంగీకరించాలి. తాము ఓడిపోయామని గ్రహించినప్పుడు, వారు మహిళా మేయర్‌పై దాడి చేశారు’ అని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. ఎన్నికల సమయంలో తనపై బీజేపీ కౌన్సిలర్లు దాడి చేశారని ఢిల్లీ కొత్త మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించడంతో ఈ నాటకం బుధవారం ప్రారంభమైంది.

Read Also: Jr. NTR political Entry: జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. నారా లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ నేతలు చెబుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే, ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపినట్లు బీజేపీ చెబుతోంది. ఆప్‌ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీంతో, స్టాండింగ్ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంపై సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలో సభలో కొందరు కౌన్సిలర్లు జై శ్రీరామ్‌, జై మోదీ అంటూ నినాదాలు చేయగా.. ఆప్‌ కౌన్సిలర్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ జిందాబాద్‌, కేజ్రీవాల్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు.ఇక, ఈ ఎన్నికల్లో ఆప్‌ కోసం అమీల్‌ మాలిక్‌, రమీందర్‌ కౌర్‌, మోహిని జీన్‌వాల్‌, సారిక చౌదరిలను నామినేట్‌ చేసింది. మరోవైపు, బీజేపీ కమల్‌జీత్‌ సెహ్రావత్‌, పంకజ్‌ లూథ్రాలను రంగంలోకి దింపింది. కాగా, బీజేపీలో చేరిన ఇండిపెండెంట్‌ కౌన్సిలర్‌ గజేందర్‌ సింగ్‌ దారాల్‌ కూడా పోటీలో ఉన్నారు. అయితే, స్టాండింగ్ కమిటీకి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది నిధులను ఎలా ఉపయోగించాలి, పలు ప్రాజెక్ట్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.