MP Mopidevi Venkataramana: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పెట్రోల్ దాడిలో మృతిచెందిన విద్యార్థి అమర్నాథ్ మృతదేహానికి నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉప్పలవారిపాలెంలో అమర్నాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి.. ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా రానుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు పోలీసులు.. ఇక, నిన్న హత్యకు గురైన బాలుడు అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నిరసన సెగ తగిలింది.. ఎంపీ వచ్చిన సందర్భంగా గుంటూరు జిల్లా చెరుకు పల్లిలో ఉద్రిక్తత నెలకొంది.. మోపిదేవిని అడ్డుకున్నారు గ్రామస్తులు.. హత్య చేసిన నలుగురికి ఇక్కడే శిక్ష వేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు.. అయితే, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం, అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మోపిదేవి.. కానీ, నిందితులకు ఇక్కడే శిక్ష పడాలంటూ ఎంపీని అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు.. ఎంపీ గో బ్యాక్, ఎంపీ డౌన్ డౌన్ అంటూ మృతుని బంధువుల నినాదాలు చేయడంతో.. ఒక్కసారిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది..
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ మోపిదేవి వెంకట రమణ.. బాలుడు అమర్నాథ్ హత్య దురదృష్టకరం అన్నారు.. రాజకీయాలు, కులాలకు అతీతంగా విచారణ జరుగుతుందన్న ఆయన.. 24 గంటల వ్యవధిలో నిందితులను అదుపులోకి తీసుకున్నాం అని తెలిపారు.. మృతుని కుటుంబానికి ఆర్థిక నష్ట పరిహారం, ఇంటి స్థలం, ఇంటినీ ప్రభుత్వ తరపున ఇస్తామని చెప్పామని.. నా తరపున లక్ష ఆర్ధిక సాయం చేస్తున్నానని వెల్లడించారు. కాగా, బాలుడి అమర్నాథ్ హత్య కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
కాగా, బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన దారుణ ఘటన బాపట్ల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం పంచాయతీ పరిధి ఉప్పాలవారిపాలెం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఉప్పాల అమర్నాథ్.. గ్రామ సమీపంలోని రాజోలు జిల్లా పరిషత్ ఉనుత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆ విద్యార్థి అక్క చెరుకుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అమర్నాథ్ సోదరిని రాజోలు గ్రామానికి చెందిన యువకుడు పాము వెంకటేశ్వరరెడ్డి నిత్యం టీజ్ చేసేవాడు. దీనిపై అమర్నాథ్ రెండు నెలల క్రితమే ఆయనను హెచ్చరించాడు. దీంతో, ఆ బాలుడిపై వెంకటేశ్వరరెడ్డి గతంలో ఒకసారి దాడి కూడా చేశాడు. వెంకటేశ్వరరెడ్డి వల్ల తనకు ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు, బంధువులకు తెలిపాడు అమర్.. ఇక, పదో తరగతి ట్యూషన్‌కి సైకిల్‌పై రాజోలు వెళ్తున్నాడు. ముందుగా ప్లాన్ చేసుకున్నప్రకారం.. వెంకటేశ్వరరెడ్డి మరో ముగ్గురు యువకులతో కలిసి గ్రామ సరిహద్దులలో ఆ బాలుడిని వెంబడించాడు. సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం చేతులు, కాళ్లు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యాడు అమర్నాథ్.. ఇది చూసిన పలువురు స్థానికులు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో, చెరుకుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అమర్నాథ్ మృతిచెందాడు.. మరోవైపు.. స్థానికులు తీసిన వీడియోలో ఆ బాలుడు మాట్లాడుతూ వెంకటేశ్వరరెడ్డి, మరో ముగ్గురు తనపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పడంతో.. ఈ ఘటన వెలుగుచూసినట్టు అయ్యింది.