Site icon NTV Telugu

Pre Wedding Shoot: ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు వద్దు.. కరపత్రం వైరల్! మీరు కూడా ఓసారి ఆలోచించండి

Proddatur Pre Wedding Shoot Ban

Proddatur Pre Wedding Shoot Ban

Proddatur Pre-Wedding Shoot Ban Pamphlet Goes Viral: ఇటీవలి రోజుల్లో ‘ఫ్రీ వెడ్డింగ్ షూట్’ ఓ ట్రెండ్ అయింది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారో.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. కొన్ని ప్రీ వెడ్డింగ్ షూట్‌లు అయితే సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నాయి. కొన్ని వీడియోస్‌లో అయితే రొమాన్స్ మరీ ఎక్కువగా ఉంటుంది. దీనిపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు వద్దు అని, మన సంప్రదాయాలను కాపాడాలని తమ వారికి చెబుతున్నారు. తాజాగా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సంఘం కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

‘వివాహ సుముహూర్త సమయంలో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్‌ను కట్టడి చేద్దాం. హిందూ వివాహ వ్యవస్థ పవిత్రతను, ఔన్నత్యాన్ని కాపాడుదాం’ అని ఆర్యవైశ్యసభ-ప్రొద్దుటూరు పేరుతో ఓ కరపత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘వివాహ ప్రక్రియలో ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లను నిషేధిద్దాం’ అని ట్యాగ్ లైన్‌గా ఉంది. ‘ఆధునికత, ట్రెండ్ పేరుతో నేటి హిందూ సమాజంలో వివాహ ప్రక్రియలో విపరీత పోకడలు, కొన్ని దుష్ట సాంప్రదాయములు నెలకొని ఉన్న కారణముగా కలకాలం కలిసి జీవించాల్సిన దంపతులు విడిపోతున్నారు. వివాహ వ్యవస్థ పవిత్రతకు భంగం కలగడానికి కారణం హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను నేటి యువత గుర్తించలేకపోవడం’ అని కరపత్రంలో పేర్కొన్నారు.

‘ఫ్రీ వెడ్డింగ్ షూట్, అలాగే వివాహ సుముహూర్త సమయంలో ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ చేసే హడావిడి వలన పురోహితులు చెప్పిన మంత్రములను వధూవరులు ఉచ్ఛరించకపోవడం, వారి చెవిలో చెప్పే వేదమంత్రములను వినకపోవడం, వాటి అర్థాలను తెలుసుకోకపోవడం వల్ల దంపతులు విడిపోతున్నారు. హిందూ ధర్మప్రచారకులు, స్వామిజీలు, పీఠాధిపతులు మరియు ప్రవచన కర్తలు ఆవేదన చెంది, హిందూ ఆలయాలు కంకణం కట్టుకొని ఈ హిందూ సమాజమును మరియు హిందూ యువతను కాపాడాలని తెలిపియున్నారు. వేదములు, సనాతన ధర్మము – హిందూ ధర్మములు శాస్త్ర ప్రమాణములు. మన ఋషులు, పెద్దలు యుక్త వయస్కులైన తమ సంతానమునకు కామమును ధర్మముతో ముడిపెట్టి వివాహ బంధం అనే ధర్మ చట్రములో ఇమిడ్చి ఉన్నారు. పరమ పవిత్రమైన హిందూ ధర్మములో శాస్త్రం ఏం చెప్పిందంటే వధూవరులు ఒకరినొకరు కళ్ళల్లో కళ్లు పెట్టిచూడడం, ఒకరినొకరు స్పర్శించుకోవడం అనేది వివాహ ప్రక్రియలో జీలకర్ర బెల్లం పెట్టిన తరువాతనే జరుగుతుంది. అలా ఒకరితలపై ఇంకొకరు ఏక కాలంలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కళ్ళల్లో కళ్లు పెట్టి చూడడం ద్వారా, భౌతిక స్పర్శ ద్వారా వారిరువురిలో తరంగాలు ఒకరినుండి ఒకరికి ప్రసరించి తద్వారా వారి బంధం బలపడి చిరకాలంపాటు కలిసి జీవించి వంశాభివృద్ధికి తోడ్పడుతుంది అనేది శాస్త్ర ప్రమాణం. అయితే ఆధునికత, ట్రెండ్ పేరుతో నేటి యువత ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని, ఎదురుకోల ఫోటో షూట్ అని పరస్పరం స్పర్శించుకోవడం, ఆలింగనాల వంటి విపరీత పోకడలకు పాల్పడుతున్నారు’ అని కరపత్రంలో రాసుకొచ్చారు.

Also Read: AP Ration: తల్లి, కొడుకుని కలిపిన రేషన్ బియ్యం.. 7 ఏళ్ల ముందు ఏం జరిగిందంటే?

తల్లిదండ్రులారా దయచేసి మీ పిల్లల వివాహ సమయంలో ఇటువంటి తప్పులు చేయకుండా, ఫ్రీ వెడ్డింగ్ షూట్లు జరుపవద్దని సభవారి విన్నపం తీర్మానము. అలాగే అనర్థాలకు మూలమైన ఈ ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ హడావిడిని కట్టడిచేసి ముహూర్త సమయంలో ఒక గంటపాటు దూరంగా ఉంచి హిందూ వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడాలని సభవారి విన్నపము మరియు తీర్మానము అని పేర్కొన్నారు. ఈ కరపత్రం ఏడాది క్రితంది. ఇదే ఆగస్టులో తీర్మానం చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మీరు కరపత్రంపై మీరు కూడా ఓసారి ఆలోచించండి.

Exit mobile version