Site icon NTV Telugu

Priyansh Arya: నమస్కారం సర్.. నా ఇన్నింగ్స్‌ ఎలా ఉంది!

Priyansh Arya Punjab

Priyansh Arya Punjab

‘ప్రియాంశ్ ఆర్య’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌పై మెరుపు సెంచరీ (103; 42 బంతుల్లో 7×4, 9×6) చేయడమే ఇందుకు కారణం. ఐపీఎల్‌లో ఆడిన నాలుగో మ్యాచ్‌లోనే సెంచరీ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌గా ప్రియాంశ్ నిలిచాడు. అంతేకాదు అత్యంత వేగవంతమైన శతకం బాదిన అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ప్రియాంశ్ ఆర్య చిన్ననాటి కోచ్ సంజయ్ భరద్వాజ్ తన శిష్యుడి ఇన్నింగ్స్‌పై ప్రశంసలు కురిపించాడు. భారీ షాట్లను కొట్టే లక్షణం అతడికి సహజంగానే వచ్చిందని చెప్పాడు. ‘కొద్దిసేపటి క్రితమే ప్రియాంశ్ ఆర్య నాకు ఫోన్ చేశాడు. నమస్కారం సర్.. నా ఇన్నింగ్స్‌ ఎలా ఉందని అడిగాడు. ఏమైందని నేను ప్రశ్నించా. నేను చేసిందేమీ లేదు, అదంతా దేవుడే చేశాడు, కొత్తగా ఏమీ చేయలేదని బదులిచ్చాడు. మ్యాచ్‌ అనంతరం 3 గంటలకు నిద్ర పోయాడంట. ఎప్పుడూ ఇలానే ఉంటాడు. నాకు ఉదయం 7.30కు ఫోన్ చేశాడు. ప్రియాంశ్ ఎంత ఎదిగినా అందరి పట్ల గౌరవంగా ఉంటాడు’ అని సంజయ్ భరద్వాజ్ చెప్పాడు.

Also Read: PBKS vs CSK: ప్రీతి జింటా సెలబ్రేషన్స్.. ఎంఎస్ ధోనీ సీరియస్ లుక్!

‘కట్, పుల్ షాట్లు కొట్టడంపై ప్రియాంశ్ చాలా శ్రమించాడు. ఓపెనర్‌గా ఆడినపుడు కొన్ని షాట్ల విషయంలో రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 140-150 కిమీ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓపెనర్‌గా ఎవరైనా భారీ షాట్స్ ఆడాలి. భారీ షాట్లను కొట్టే లక్షణం ప్రియాంశ్‌కు సహజంగానే వచ్చింది. అతడు అద్భుతంగా ఆడాడు. భారత జట్టుకు ఎంపికవుతాడు’ అని సంజయ్ భరద్వాజ్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో గౌతమ్ గంభీర్, నితీశ్ రాణా, అమిత్ మిశ్రా లాంటి ప్లేయర్లకు సంజయ్ శిక్షణ ఇచ్చాడు. సంజయ్ శిక్షణలో ఎందరో భారత జట్టుకు ఆడారు.

Exit mobile version