Site icon NTV Telugu

Priya Kapoor: రూ.30 వేల కోట్ల ఆస్తి వివాదం.. సుప్రీంకోర్టు మెట్లేక్కిన వ్యాపారవేత్త రెండో భార్య!

Priya Kapoor

Priya Kapoor

Priya Kapoor: దివంగత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రెండో భార్య ప్రియా కపూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2016లో నటి కరిష్మా కపూర్, సంజయ్ కపూర్ మధ్య విడాకులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విడాకుల కేసుకు సంబంధించిన పత్రాల ధృవీకృత ప్రతులు ఇవ్వాలని ప్రియా కోర్టును కోరారు. ఈ పత్రాల్లో విడాకుల సమయంలో కుదిరిన రాజీ వివరాలు, పిల్లల సంరక్షణ ఎలా ఉండాలనే అంశాలపై సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇంజంక్షన్‌పై ఉత్తర్వులను రిజర్వ్ చేయడానికి మూడు రోజుల ముందు, గత నవంబర్ చివర్లో ప్రియా ఈ దరఖాస్తు దాఖలు చేశారు. ఈ కేసు రేపు విచారణకు రానుంది. విడాకుల సమయంలో కుదిరిన ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు కేవలం కరిష్మా కపూర్, సంజయ్ కపూర్‌లకు మాత్రమే తెలుసు. 2016లో ఈ కేసు విచారణ బహిరంగంగా కాకుండా న్యాయమూర్తి ఛాంబర్‌లోనే జరిగింది. ఇద్దరి సమ్మతితో స్నేహపూర్వకంగా ఈ విడాకుల ప్రక్రియ ముగిసింది.

READ MORE: MP Arvind: అవును.. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉంది.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

సుప్రీంకోర్టు రికార్డుల ప్రకారం.. ఇరు పక్షాలు సంతకం చేసిన ‘కన్సెంట్ టర్మ్స్’ను స్వీకరించారు. అందులో వారి ఇద్దరు పిల్లల సంరక్షణ హక్కులు కరిష్మా కపూర్‌యే చూసుకోవాలని, సంజయ్ కపూర్‌కు పిల్లలను కలిసే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఆర్కే అగర్వాల్‌ల ధర్మాసనం ముందు ఛాంబర్‌లో జరిగిన విచారణ అనంతరం, కరిష్మా తరఫు న్యాయవాది మాట్లాడుతూ దంపతుల మధ్య ఉన్న అన్ని వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కారమయ్యాయని తెలిపారు. కాగా.. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ జూన్ 2025లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఆయన ఆస్తి విషయంలో న్యాయ వివాదాలు మొదలయ్యాయి. సుమారు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య చట్టపరమైన పోరు కొనసాగుతోంది. సంజయ్ కపూర్ మరణానంతరం ఆయన ఆస్తికి సంబంధించిన వివాదంలో కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ కపూర్‌లు కూడా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version