Site icon NTV Telugu

PM Modi and Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోడీ అభినందనలు.. కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం..

Pm Modi And Pawan Kalyan

Pm Modi And Pawan Kalyan

PM Modi and Pawan Kalyan: జపనీస్ సంప్రదాయ యుద్ధకళ కెంజుట్సు (Kendo)లో అధికారిక ప్రవేశం సాధించి అరుదైన ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు.. ఈ మేరకు ఆయన పవన్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షల సందేశాన్ని పంపించారు. పవన్ కల్యాణ్ సాధించిన ఈ విజయం గురించి తెలుసుకున్నానని పేర్కొన్న ప్రధాని మోడీ.. “జపనీస్ మార్షల్ ఆర్ట్స్ రంగంలో మీరు సాధించిన ఘనత ప్రశంసనీయం. ప్రజా జీవితంలో, సినిమా రంగంలో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో, నిజాయితీతో యుద్ధ కళలను అభ్యసించడం స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు..

Read Also: Bhogi Festival: భోగి పండుగ ప్రత్యేక ఏంటి..? చిన్న పిల్లలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు..?

దశాబ్దాల పాటు పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌పై చూపిన అంకితభావం యువతకు గొప్ప ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు ప్రధాని మోడీ.. వృత్తిపరమైన బాధ్యతలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అడ్డంకి కావని పవన్ సాధన ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లిందని అన్నారు. యుద్ధ కళలకు శారీరక బలంతో పాటు మానసిక సమతుల్యత, సహనం, స్వీయ నియంత్రణ అవసరమని, ఈ కఠినమైన సంప్రదాయాన్ని పవన్ అనుసరించడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలకు ప్రజా జీవితంలో ఉన్న నేతలు స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. ఫిట్నెస్ పట్ల పవన్ కల్యాణ్ చూపిస్తున్న క్రమశిక్షణ ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో పవన్ చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోడీ తన సందేశాన్ని ముగించారు.

ఇక, ఇదే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పంపిన అభినందన సందేశానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మోడీకి ప్రతిస్పందన లేఖను పంపారు. “మోడీజీ పంపిన ఆత్మీయ అభినందన సందేశం నాకు గొప్ప గౌరవం. మీ ప్రేమపూర్వక మాటలు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి” అని పవన్ పేర్కొన్నారు. యుద్ధ కళలు తన జీవిత ప్రయాణంలో ఏళ్ల తరబడి అంతర్భాగంగా ఉన్నాయని, అవి శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తాయని పవన్ తెలిపారు. జీవితకాల అభ్యాసం, స్వీయవృద్ధిపై ప్రధాని ఇచ్చిన సందేశం తనకు ఎంతో స్ఫూర్తినిస్తోందని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రధాని ప్రారంభించిన ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పవన్ ప్రశంసించారు. మోడీ నాయకత్వంలో బలమైన, దృఢమైన భారతదేశం నిర్మితమవుతుందని, స్వామి వివేకానంద ఆకాంక్షించిన శక్తివంతమైన సమాజం ఆవిష్కృతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలకు అంకితభావంతో సేవ చేయాలన్న తన సంకల్పానికి ప్రధాని ప్రోత్సాహం మరింత బలం ఇస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Exit mobile version