భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో ముందుకెళ్లోందన్నారు ద్రౌపది ముర్ము. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమర జవాన్ల త్యాగాలను స్మరించుకోవాలని, అమర జవాన్ల వల్లే మనకు స్వేచ్చ లభించిందని ద్రౌపది ముర్ము అన్నారు.
విదేశీ దాస్య శృంఖలాలను తెంచుకుని స్వాతంత్య్రం సాధించుకున్నామన్నారు ద్రౌపది ముర్ము. అంతేకాకుండా.. కరోనా కష్టకాలాన్ని అధిగమించామని, స్టార్టప్‌లు దూసుకెళ్తున్నాయని ద్రౌపది ముర్ము అన్నారు. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభాలతో అల్లాడుతున్నాయన్న ద్రౌపది ముర్ము.. కరోనా తర్వాత మన ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోందన్నారు. వ్యాక్సినేషన్‌లో మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని ఆమె వ్యాఖ్యానించారు. మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపుతున్నారని ద్రౌపది ముర్ము అన్నారు.