Site icon NTV Telugu

Preity Zinta: పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం.. కోర్టులో ప్రీతి జింటా పిటిషన్‌!

Preity Zinta Ipl 2025

Preity Zinta Ipl 2025

బాలీవుడ్ నటి, పంజాబ్‌ కింగ్స్‌ సహ యజమాని ప్రీతి జింటా తన కో-ఓనర్ (సహ యజమానుల)లపై కోర్టులో కేసు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించారంటూ.. పంజాబ్‌ డైరెక్టర్లు మోహిత్‌ బుర్మాన్‌, నెస్‌ వాడియాపై చండీగఢ్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. నెస్‌ వాడియా మద్దతుతో మోహిత్‌ బర్మాన్‌ సమావేశాన్ని నిర్వహించారని ఆరోపించారు. డైరెక్టర్‌గా మునీశ్‌ ఖన్నా నియామకాన్ని వెంటనే నిలిపివేయాలని ప్రీతి తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ వ్యవహారంతో పంజాబ్‌ కింగ్స్‌ జట్టులోని లుకలుకలు బయటపడ్డాయి.

కేపీహెచ్‌ డ్రీమ్‌ క్రికెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లుగా మోహిత్‌ బుర్మాన్‌, నెస్‌ వాడియా, ప్రీతి జింటా ఉన్నారు. ఈ కంపెనీదే పంజాబ్‌ కింగ్స్‌ టీమ్. ఏప్రిల్ 21న నిర్వహించిన సర్వసభ్య సమావేశం (ఈజీఎం) చట్టబద్ధతను ప్రీతి జింటా కోర్టులో సవాలు చేశారు. ‘కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈజీఎం సమావేశాన్ని నిర్వహించారు. నెస్‌ వాడియా మద్దతుతో మోహిత్‌ బర్మాన్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈజీఎం సంబంధించి అభ్యంతరాలను నేను ఏప్రిల్‌ 10నే ఈమెయిల్‌ రూపంలో తెలియజేశా, ఎవరూ పట్టించుకోలేదు. నాతొ పాటు మరో డైరెక్టర్‌ కరణ్‌ పాల్‌ ఈ సమావేశానికి హాజరైయారు. అయినప్పటికీ ఈ సమావేశం చట్టబద్ధత చెల్లదని ప్రకటించాలి. సమావేశంలో మునీశ్‌ ఖన్నాను డైరెక్టర్‌గా నియమించారు. ఖన్నా నియామకాన్ని నిలిపివేయాలి’ అని ప్రీతి జింటా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Also Read: Today Gold Rate: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

ఈజీఎం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలు చేయకుండా చూడాలని చండీగఢ్‌ కోర్టును ప్రీతి జింటా అభ్యర్థించారు. ఈ కేసు పరిష్కారం అయ్యేవరకూ తాను, కరణ్‌పాల్‌ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని కోర్టును కోరారు. జట్టులో వివాదాలు ఉన్నప్పటికీ ప్రీతి జింటా పంజాబ్‌ మ్యాచ్‌లకు హాజరై జట్టుకు మద్దతుగా నిలిచారు. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. 12 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. టాప్-2 లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

Exit mobile version