Morocco Earthquake: శుక్రవారం అర్థరాత్రి సెంట్రల్ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దాదాపు 820 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మరో 672 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 51 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నగరాలు, పట్టణాల వెలుపల ఎక్కువ నష్టం సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, నష్టం ఏ స్థాయిలో ఉందో అధికారులు ఇంకా తేల్చలేదు.
Also Read: G20 Summit: జీవ ఇంధనంపై ప్రపంచ కూటమి ఏర్పాటు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొరాకోలోని మర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. 6.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది ఆ తర్వాత కొద్ది సేపటికి 4.9 తీవ్రతతో 19 నిమిషాలపాటు పలు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. అల్ హౌజ్, మర్రాకేశ్, క్వార్జాజేట్, అజిలాల్ సహా పలు ప్రాంతాలు ఈ భూకంప ధాటికి వణికిపోయాయి. దాంతో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. ‘అకస్మాత్తుగా భూమి కంపించడంతో భవనాలు కదిలిపోయాయి. దాంతో ప్రజలు కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశారు. శతాబ్దకాలంలో ఉత్తరాఫ్రికా ఈ స్థాయి భూకంపాన్ని ఇప్పటి వరకూ చవిచూడలేదని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. మరోవైపు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Also Read: Nvidia CEO: ఈ జనరేషన్‌కు ఎన్‌విడియా సీఈవో సలహా.. ఏఐ నేర్చుకోండి..
ఈ భూకంపం కారణంగా గాయపడిన వారితో సమీప ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. ఈ భూకంపం ధాటికి ప్రజలు భయంతో వణికిపోయారు. అర్ధరాత్రి కావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఈ క్రమంలోనే మైఖేల్ బైజట్ అనే 43 ఏళ్ల వ్యక్తి కూడా భూకంప సమయంలో తన అనుభవాన్ని వెల్లడించాడు. భూకంపం సంభవించినప్పుడు తాను గాఢ నిద్రలో ఉన్నానని, మంచం ఊగిపోతుండటంతో తనకు మెళుకువ వచ్చిందని, కళ్లు తెరచి చూడగానే మంచం గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపించిందని మైఖేల్ వెల్లడించారు. నిద్ర నుంచి తేరుకుని భూకంపం సంభవిస్తోందని గ్రహించి బయటకు పరుగులు తీశానని తెలిపారు. భూకంపం కారణంగా మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్విటర్ వేదికగా దేవుడిని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకోకు సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందన్నారు.