హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళా భవన్‌లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026 (సడక్ సురక్ష – జీవన్ రక్ష) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 30 సంవత్సరాలకు పైగా డ్రైవింగ్ చేస్తూ ఒక్క ప్రమాదం కూడా చేయని 18 మంది ప్రమాద రహిత డ్రైవర్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, ఈడీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతకు నెల రోజుల కార్యక్రమం:
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలుగా నిర్వహించేవారని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దీనికి మరింత ప్రాధాన్యం ఇచ్చి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు కేవలం రవాణా శాఖ లేదా ఆర్టీసీకే పరిమితం కాదని.. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఆర్ అండ్ బీ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలవుతుందని మంత్రి తెలిపారు.
విద్యార్థుల ద్వారా అవగాహన:
రవాణా శాఖ విద్యార్థులకు ప్రత్యేక అప్లికేషన్ అందిస్తుందని, విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద రోడ్డు నిబంధనలు పాటిస్తామని, అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమని అఫిడవిట్ తీసుకొని ప్రభుత్వానికి సమర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. చిన్న వయసు నుంచే పిల్లల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం ముఖ్యమని అన్నారు. రాష్ట్రంలో కేవలం వెయ్యి మంది రవాణా శాఖ అధికారులు ఉండగా, కోటి 80 లక్షల వాహనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలు జీవితాంతం బాధపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ ఆదర్శంగా నిలవాలి:
ప్రమాదాలను తగ్గించడంలో ఆర్టీసీ ఆదర్శంగా నిలవాలని మంత్రి పొన్నం సూచించారు. 20 వేల డ్రైవర్లు, 10 వేల బస్సులు, రోజుకు 60 లక్షల ప్రయాణికులు, 39 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ రాష్ట్రానికి లైఫ్‌లైన్‌లా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉచిత ప్రయాణ పథకం ద్వారా 260 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించి, రూ.8,800 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని పేర్కొన్నారు.
జీరో ప్రమాదాల లక్ష్యం:
ఒక కోటి కిలోమీటర్లకు ఒక ప్రమాదం జరుగుతోందని, ఆర్టీసీ ప్రమాదాలను జీరో స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి. వాహనాల ఫిట్‌నెస్ తప్పనిసరి అని, ఫిట్‌నెస్ ఉన్న బస్సులనే రోడ్లపైకి అనుమతించాలని స్పష్టం చేశారు. నగరంలో 326 రూట్లలో కొత్త ఆర్టీసీ బస్సులు నడుపుతున్నామని, గ్రామాల్లో అవసరం ఉన్న చోట ప్రతిపాదనలు ఇస్తే అక్కడ కూడా బస్సులు నడిపిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలలకూ ఆర్టీసీ సేవలు విస్తరించడమే లక్ష్యమన్నారు. రోడ్డు భద్రత మన జీవితంలో అంతర్భాగంగా మారాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రి, మంత్రులందరూ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారని మంత్రి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన కుటుంబాలు, శాశ్వత వికలాంగులైన వారి పరిస్థితి దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
2026లో కొత్త ఆశలు:
2026 నాటికి ఆర్టీసీ కుటుంబాలు పాత బకాయిలు తొలగించుకొని ముందుకు సాగాలని, మరింత శ్రమించి బంగారు భవిష్యత్తు సాధించాలని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ రవాణా శాఖ చేపట్టిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఆర్టీసీ ఉద్యోగులు అగ్రభాగాన నిలబడి కీలక పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు.
