సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్‌లో సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గా గెలవడానికి సహకరించిన మీ అందరికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటికే మద్దతు కోరుతూ సిపిఐ నేతలను కలిశారని, భవిష్యత్ లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ కాంగ్రెస్ మధ్య ఎలాంటి బిఫభిప్రాయాలు ఉండవని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదం లో ఉందని, 30 సంవత్సరాల తరువాత మోడీ ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు 400 సీట్లు అంటున్నారని, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. పైకేమో శ్రీరామ్ శ్రీరామ్ లోలోపల రిజర్వేషన్లకు రాం రాం చెబుతున్నారని, ఎం చేసామో చెప్పుకోకుండా అక్షింతలు వచ్చాయా…? రాముడు ఫోటో వచ్చిందా అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
అంతేకాకుండా..ఈ నియోజక వర్గానికి ఏం చేసారో చెప్పాలని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. నిన్న మోడీ వేములవాడ వస్తే ఆలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తారనుకున్నామని, వేములవాడ రాజన్న ఆలయనికి కోటి రూపాయలు కాదు కదా. .ఒక కోడె కూడా ఇవ్వలేదని ఆయన తెలిపారు. వచ్చే జూన్ మాసంలో సీపీఐ గ్రామ కార్యదర్శి నుండి రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు, నారాయణను కూడా పిలిచి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం చేసుకుందామని మంత్రి పొన్నం అన్నారు.