NTV Telugu Site icon

Ponnam Prabhakar: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది

New Project 2023 11 08t140036.182

New Project 2023 11 08t140036.182

Ponnam Prabhakar: తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నామినేషన్ల పర్వం కొనసాగుతుండడంతో బరిలో నిలిచే నేతలంతా ఒక్కొక్కరిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి సెట్ నామినేషన్ పత్రాలను ఆ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ దాఖలు చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్వో కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ మెట్ట ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందన్నారు. సెంటిమెంట్‌‌కే హుస్నాబాద్ అంటున్నారని.. అభివృద్ధి అంతా సిద్ధిపేట, గజ్వేల్‎లో చేస్తున్నారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ పదేళ్లయిన పూర్తి చేయలేదని పొన్నం విమర్శించారు. హుస్నాబాద్ ప్రాంతానికి వెన్నెముక లాంటి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు. అందుకే హుస్నాబాద్ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు.

Read Also:Varun Tej: అరేయ్ బాబు.. మా పెళ్లి వీడియోను అమ్ముకోలేదు రా అయ్యా.. వరుణ్ టీం క్లారిటీ..

ఈ క్రమంలోనే సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సిపిఐ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తారని స్పష్టం చేశారు. అపర భగీరథుడు అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందంటూ ఎద్దేవా చేశారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంత వరప్రదాయని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పట్టించుకోవడంలో విఫలమయ్యాడన్నారు. బిఆర్ఎస్, బిజెపిలు రెండు ఒక్కటే, రాష్ట్రంలో ఆ రెండు పార్టీలను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ గెలుపు కమ్యూనిస్టుల గెలుపుగా భావిస్తున్నామని చాడా తెలిపారు.

Read Also:Balineni Srinivasa Reddy: నిరాధారంగా నాపై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు..

Show comments