Site icon NTV Telugu

Wild Hearts Pub: వైల్డ్ హార్ట్ పబ్ లో గలీజ్ దందా.. బిజినెస్ కోసమే అమ్మాయిలతో ఎర..!

Wild Hearts Pub

Wild Hearts Pub

Wild Hearts Pub: హైదరాబాద్‌ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ప్రముఖ వైల్డ్ హార్ట్ పబ్‌ పై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. పబ్‌లో అర్ధనగ్న నృత్యాలు, అసభ్యకర కార్యక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగుతున్నట్టు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆరా తీశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు సమాచారం రావడంతో, పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. సింగిల్‌గా వచ్చే వ్యక్తులను టార్గెట్ చేసి, వారి వద్దకు యువతులను పంపించి, మద్యం మత్తులో బిల్లు పెరిగేలా చేసి మోసపూరితంగా వసూలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

పబ్ యాజమాన్యం రాత్రి అనుమతిగల సమయాన్ని మించి పబ్‌ను నడుపుతూ, ముంబయి నుంచి ప్రత్యేకంగా యువతులను రప్పించి అభ్యంతరకరంగా, అర్ధనగ్నంగా నృత్యాలు చేయిస్తూ వినోద కార్యక్రమాలు నిర్వహించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దాడిలో మొత్తం 17 మంది యువతులను అదుపులోకి తీసుకుని వారి వివరాలను నమోదు చేసారు పోలీసులు. పబ్ యజమానితో పాటు అక్కడ ఉన్న పలువురు కస్టమర్లను కూడా అరెస్ట్ చేశారు. పబ్ యాజమాన్యం నియమాలను పాటించకపోవడం, పబ్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి అంశాలపై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశారు.

ఈ ఘటనపై చైతన్యపురి సీఐ మాట్లాడుతూ.. పబ్ నిబంధనలను పాటించకపోవడం, అక్కడ జరిగే అనుచిత కార్యకలాపాలపై మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నగరంలో ఇటువంటి అక్రమ నైట్‌ క్లబ్‌లు, పబ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version