Site icon NTV Telugu

Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

Allu Arjun

Allu Arjun

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతవారం సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్‌ బెయిల్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు నోటీసులు అందించిన నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

Read Also: Manchu Manoj: మంచు మనోజ్ ఫిర్యాదు కాపీలో సంచలన అంశాలు

డిసెంబర్‌ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌ను రేపు పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి 18మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. ఇందులో అల్లు అర్జున్ 11వ నిందితుడిగా ఉన్నారు. డిసెంబర్‌ 13న అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. అనంతరం రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తుతో నాలుగు వారాల బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం.

 

Exit mobile version