అందరి తప్పొప్పుల్ని సరిదిద్దే పోలీసు శాఖలోకే తప్పుడు పత్రాలతో ప్రవేశిస్తే.. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా నెలనెలా జీతాలు తీసుకుంటూ విధులు నిర్వర్తిస్తే.. అవును, చిత్తూరు పోలీసు జిల్లాలో అక్షరాలా ఇదే జరిగింది. నకిలీ డీవో(డిపార్ట్‌మెంటల్ ఆర్డర్)లతో ఉద్యోగంలో చేరిన హోంగార్డులపై వేటు పడింది. జిల్లాలో 87 మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ అనంతపురం డీఐజీ రవిప్రకాష్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డుల్లో రెండు కేటగిరీలు ఉంటాయి. ఒకటి పోలీసు శాఖలోని స్టేషన్లలో పనిచేయడం. వీళ్లకు ప్రభుత్వం నుంచే వేతనాలు అందుతాయి. రెండోది.. ఆన్–పేమెంట్.. అగ్నిమాపక, టీటీడీ, ఆర్టీసీ, రవాణాశాఖ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీళ్లకు ఆయా శాఖల నుంచి ప్రతీనెలా వేతనాలు అందుతాయి. ఈ సంస్థల్లో పనిలేనప్పుడు వీరిని పోలీసుశాఖకు అప్పగిస్తారు. ఆ సమయంలో వాళ్లకు వేతనాలు చెల్లించరు. పని ఉంటేనే వేతనాలు చెల్లిస్తారు. ఇటీవల ఇలాంటి హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేటపుడు చిత్తూరు ఆర్‌ఐ మురళీధర్ ఉండాల్సిన వాళ్లకంటే కొందరు ఎక్కువగా ఉండటంతో విషయాన్ని ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
Also Read :Tele Consultation : తెలంగాణ రాష్ట్రానికి మరో అరుదైన అవార్డు
దీంతో.. అలాగే, 3 నెలల క్రితం వన్‌టౌన్‌లో ఆర్‌ఐ మురళీధర్ ఈ విషయమై ఫిర్యాదు చేయగా, కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత మణికంఠ అనే హోంగార్డును విచారించగా.. తాను, యువరాజ్, జయకుమార్, కిరణ్ తదితరులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు డబ్బులు వసూలుచేసి, అప్పటి అధికారులకు లంచంగా ఇచ్చి హోంగార్డు ఉద్యోగాలు పొందినట్లు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తునకు ఆదేశించిన ఎస్పీ మరిన్ని వివరాలు రాబట్టారు. హోంగార్డులకు డ్యూటీలు కేటాయించేపుడు పాస్‌పోర్టు, డీఓ (డ్యూటీ ఆర్డర్)ను అధికారులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చేటపుడు నిజమైన హోంగార్డును పుత్తూరు అగ్నిమాపక శాఖలో విధులు కేటాయిస్తున్నట్లు టైపుచేసి, ఇతనితో పాటు అదనంగా మరో ఐదుగురు నకిలీ హోంగార్డుల పేర్లను టైపుచేసి డీఓ ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంటారు. ఇలా ఏకంగా 87 మందిని పలు సంస్థల్లో నియమించేశారు. అయితే.. ఎప్పటికేనా చేసిన తప్పు బయట పడాల్సిందే కదా.. దీంతో వీళ్ల గుట్టు ఇలా రట్టైంది.
