బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో తాము భయాందోళనకు గురయ్యామని ఆమె వాపోయారు. ఈ ఘటనపై అలర్ట్ అయిన పోలీసులు ఆగంతుకుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదుపులో ఉన్న వ్యక్తి ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో ఢిల్లీతోపాటు పాతబస్తీలోను చోరీలు చేసినట్లు సమాచారం. పశ్చిమ మండల డీసీపీ విజయకుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు అక్రమ్ ను విచారిస్తున్నారు.
Also Read:Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా
ఈ ఘటనపై డీకే అరుణ మాట్లాడుతూ.. గత 38 ఏళ్లుగా నేను ఇదే ఇంట్లో ఉంటున్నాను.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. అగంతకుడు వచ్చిన సమయంలో ఇంట్లో మా కూతురు, మనవరాలు ఉంది. ఆ సమయంలో అలజడి విని మా పాప, మనవరాలు లేచి ఉంటే.. ఆ వ్యక్తి దాడికి యత్నించే వాడేమో.. నేను నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ పరంగా ఎన్నో సార్లు ఇబ్బందికి గురయ్యాను. లోకల్ గా అదనపు భద్రత కల్పించాలని చాలాసార్లు పోలీస్ అధికారులను కోరాను. అయినా వారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ ఘటనతో ఐనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ప్రజాప్రతినిధి ఐన నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.