PMAY Houses: సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, జలశక్తి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మొత్తం 2 కోట్ల ఇళ్లను కేటాయిస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకు ఈ ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
2024లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. గతంలో కేటాయించిన ఇళ్లకు అదనంగా కూడా పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరవుతున్నాయని పెమ్మసాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 2.25 లక్షలు, తెలంగాణకు 1.25 లక్షల ఇళ్లు మంజూరవుతున్నట్లు వెల్లడించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల కేటాయింపు జరుగుతుందని స్పష్టం చేశారు.
అర్హులైన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ‘ఆవాస్ ప్లస్’ మొబైల్ యాప్‌ను వినియోగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ఏ ఒక్క కుటుంబానికీ అన్యాయం జరగకుండా నిష్పక్షపాతంగా లబ్ధిదారులను గుర్తించి పథకం ప్రయోజనాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పెమ్మసాని వివరించారు. ప్రాథమికంగా రూ.1.20 లక్షలు, అదనంగా రూ.1.80 లక్షల వరకు సహాయం అందించనున్నట్లు తెలిపారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రత్యేకంగా రూ.12 వేల ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు.
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారని పెమ్మసాని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో కేంద్రం 1.75 లక్షల ఇళ్లను కేటాయిస్తే.. కేవలం 42 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
కొత్తగా మంజూరైన ఇళ్లతో పాటు ఇప్పటికే నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కూడా రాబోయే 2–3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం తాజా నిర్ణయంతో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.

