కేంద్రంలో మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. శుక్రవారం ఇటలీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలువబడ్డారు. అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా అనే రిసార్ట్‌లో జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్, జపాన్ ప్రధాని ఫుమ్లో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలానీ తదితర అగ్రనేతలు హాజరుకానున్నారు.
ఇదిలా ఉంటే జీ 7 సదస్సును ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించనున్నారు. జీ 7 సదస్సులో మాట్లాడే మొదటి కాథలిక్ చర్చి అధిపతిగా పోప్ ఫ్రాన్సిస్ నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఓ సెషన్‌కు హాజరై తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుదల గురించిన చర్చలో పాల్గొనే అవకాశం ఉంది.
కాగా జీ-7 సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం జీ-20 ఫలితాలను అనుసరించేందుకు ఉపకరిస్తుందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా పేర్కొన్నారు. ఇక స్విట్జర్లాండ్‌లో జరగబోయే శాంతి సదస్సులోనూ భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. అయితే భారత్ తరఫున ఎవరు హాజరవుతారనే వివరాలను క్వత్రా వెల్లడించలేదు. రెండ్రోజుల పాటు మోడీ ఇటలీలో పర్యటించనున్నారు. సదస్సులో భాగంగా అమెరికా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా దేశాధినేతలతోపాటు సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, అబుధాబి రాజు షేక్ మోహమ్మద్ బిన్ జాయద్, మరి కొందరు అరబ్ రాజకుటుంబీకులను మోడీ కలుసుకోనున్నారు.