NTV Telugu Site icon

PM Narendra Modi: మోర్బీ వంతెన కూలిన ప్రదేశాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Narendra Modi: గుజరాత్ మోర్బీ వంతెన కూలిన ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. దాదాపు 135 మంది ప్రాణాలను బలిగొన్న మోర్బీ వంతెన దుర్ఘటన జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. మచ్చు నదిలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆదివారం మోర్బీ పట్టణంలోని మోర్బీ కేబుల్ వంతెన కూలిపోయి, ప్రజలు మచ్చు నదిలో మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 135 మంది మరణించారు. 100 మందికి పైగా గాయాలకు చికిత్స పొందుతున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ మోర్బీలోని సివిల్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రమాదంలో గాయపడినవారిని, బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ఈ ఘటన వివరాల గురించి ఆరా తీశారు. 26 మృతుల కుటుంబాలను ప్రధాని మోడీ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Gujarat Tragedy: గుజరాత్‌ వంతెన దుర్ఘటన.. భారత్‌కు సంతాప సందేశం పంపిన జీ జిన్‌పింగ్

మోర్బీలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మోర్బీలో దురదృష్టకర దుర్ఘటన జరిగినప్పటి నుండి జరుగుతున్న రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల గురించి ప్రధానికి అధికారులు వివరించారు. దుర్ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించారు. బాధిత వారికి అన్ని విధాలా సహాయం అందేలా చూడాలని ప్రధాని ఉద్ఘాటించారని పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. అత్యున్నత స్థాయి సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘవి, గుజరాత్ చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు రాష్ట్ర హోం శాఖ, గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో ఎలాంటి అలసత్వం ఉండదని ప్రధాని గతంలోనే చెప్పారు. వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపేందుకు గుజరాత్ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. మోర్బి బ్రిడ్జి కూలినందుకు ఒరేవా అధికారులు, వంతెనను పునరుద్ధరించిన సంస్థ, టిక్కెట్లు అమ్మేవారు, భద్రతా సిబ్బందితో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే ప్రధాని రాకకు ముందే ఈ వంతెన మరమ్మతులు చేసిన కంపెనీ పేరు కనిపించకుండా షీట్‌తో కవర్‌ చేశారు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యలపై దృష్టి పెట్టారు. రాత్రికి రాత్రే ఆసుపత్రి గోడలకు రంగులు వేయించడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. రాత్రిపూట మరమ్మతులు జరుగుతుండడంతో స్థానిక మీడియా అక్కడికి చేరుకుంది. రంగులు వేస్తున్న సిబ్బందిని, ఆసుపత్రిలో చేపట్టిన మరమ్మతులను ఫొటోలు తీసి ప్రసారం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోపక్క అర్ధరాత్రి ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోషూట్ కోసం బీజేపీ బిజీబిజీగా ఏర్పాట్లు చేస్తోందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు.