Site icon NTV Telugu

PM Narendra Modi: బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొననున్న మోదీ.. బ్రెజిల్‌లో ఘన స్వాగతం..!

Pm Modi

Pm Modi

PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం బ్రెజిల్‌ లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. ఆయనకు అక్కడి భారత దేశ వలసదారుల సముదాయం అత్యంత ఘన స్వాగతం పలికింది. సంప్రదాయ సంగీతం, నృత్యాలతో ప్రధానిని ఆహ్వానించారు. ముఖ్యంగా ‘ఓపరేషన్ సింధూర్’ థీమ్‌పై నిర్వహించిన నృత్య ప్రదర్శనతో సభా ప్రాంగణం మార్మోగింది. అలాగే ఇతర ప్రదర్శనలతో పాటు, బ్రెజిలియన్ సంగీత బృందం భారత ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది భారతీయ సాంస్కృతిక విలువలను ప్రదర్శించడమే కాక, అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవాన్ని పెంచింది.

Read Also:Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్‌ టార్గెట్‌ అదే.. వైభవ్‌ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రధాని మోదీ జూలై 6-7 తేదీలలో జరిగే 17వ బ్రిక్స్ దేశాల నేతల శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శాంతి, భద్రత, బహుళపక్ష వ్యవస్థల బలోపేతం, ఏఐ వినియోగం, వాతావరణ మార్పు, గ్లోబల్ హెల్త్, ఆర్థిక వ్యవస్థలు వంటి అంశాలపై నేతలతో చర్చించనున్నారు. సమావేశానికి సంబంధించి పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా మోదీ నిర్వహించనున్నారు. శిఖరాగ్ర సమావేశం అనంతరం మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్నాసియో లులా డ సిల్వాతో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా వ్యాపారం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్ష సాంకేతికం, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఇక బ్రెజిల్ చేరుకున్న మోదీ మాట్లాడుతూ.. రియో డి జనీరోలో బ్రెజిల్‌ లోని భారతీయలు నాకు చాలా హృదయపూర్వక స్వాగతం పలికారని.. వారు భారతీయ సంస్కృతితో ఎంతగా ముడిపడి ఉన్నారో, భారతదేశ అభివృద్ధి పట్ల వారికి ఎంత ఇష్టం ఉందో ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

Read Also:ENG vs IND: సరేలే ఎన్నో అనుకుంటాం.. హ్యారీ బ్రూక్‌కు గిల్ స్ట్రాంగ్ కౌంటర్‌!

ఈ సందర్భంగా భారత వలసదారుల సందడి కూడ రియో డి జనీరో వీధుల్లో కనువిందుగా మారింది. బ్రెజిల్ పర్యటనకు ముందు మోదీ అర్జెంటీనాలో పర్యటించి అక్కడి అధ్యక్షుడు జేవియర్ మిల్లెయితో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. అంతకు ముందు ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఘానా దేశాలను కూడా సందర్శించారు. జూలై 9న మోదీ నామీబియా చేరుకొని, అక్కడ ప్రసంగించనున్నారు. జూలై 2 నుంచి జూలై 9 వరకు జరిగిన ఈ ఐదు దేశాల, ఎనిమిది రోజుల పర్యటనలో ప్రధాని మోదీ అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం గొంతును బలంగా వినిపించిస్తున్నారు.

Exit mobile version