PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా దేశంలోని క్రీడాకారులు, యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా సంభాషించారు. ‘ఖేలో ఇండియా డైలాగ్ – ఖేల్ కీ బాత్, ప్రధాని మోడీతో’ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న యువ అథ్లెట్లు, యువత, యువ నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. సుమారు 1,500కి పైగా విద్యాసంస్థల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని క్రీడా రంగానికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశంలో క్రీడా సంస్కృతిని పటిష్టం చేయాలంటే క్షేత్రస్థాయి నుంచి ప్రతిభను వెలికితీయడం అత్యంత ఆవశ్యకమని నొక్కిచెప్పిన మోడీ, “ఆడేవాడే ఆనందంగా వికసిస్తాడు” (జో ఖేలేగా, వో ఖిలేగా) అనే బలమైన సందేశాన్ని అందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులకు, క్రీడా రంగానికి చెందిన ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోడీ జాతీయ క్రీడా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో ప్రధానంగా మౌలిక వసతుల కల్పన, వర్ధమాన క్రీడాకారుల గుర్తింపు, సరైన శిక్షణ, స్పోర్ట్స్ సైన్స్ వినియోగం, క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా వంటి కీలకమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ‘ఖేలో ఇండియా’ ఉద్యమం ద్వారా చిన్న చిన్న నగరాలు, గ్రామాలు, పట్టణాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మౌలిక వసతులు, వనరుల కొరత ఉన్న ప్రాంతాలకు సైతం క్రీడా సౌకర్యాలను చేరువ చేసి, క్రీడాకారులకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్నట్లు వివరించారు.

అంతేకాకుండా, అంతర్జాతీయ వేదికలపై భారత జెండాను రెపరెపలాడించే దిశగా, 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్‌ను క్రీడా రరంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇప్పటి నుంచే అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రణాళిక అని వెల్లడించారు. ఈ దిశగా క్రీడల్లో భారత్‌ను మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై యువత కూడా తమ సలహాలు, సూచనలను ప్రధానితో పంచుకున్నారు. క్రీడలతోనే శారీరక, మానసిక వికాసం సాధ్యమని పునరుద్ఘాటిస్తూ, మోడీ మరోసారి “ఆడేవాడే ఆనందంగా వికసిస్తాడు” అని గుర్తుచేస్తూ యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.