భారత్ పొరుగు దేశమైన నేపాల్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ అభివృద్ధి, పునర్నిర్మాణం కోసం రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో సోమవారం ఢిల్లీలో జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తులో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మోడీ భారత్-నేపాల్ సంబంధాలు కేవలం పొరుగు దేశాల మధ్య బంధం మాత్రమే కాదని, రెండు దేశాల ప్రజల మధ్య విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు.
నేపాల్‌లో భారత్ సహకారంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఇరు దేశాల ప్రధానులు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ వరకు ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించారు. ఈ రైలు మార్గం రెండు దేశాల మధ్య రవాణా, పర్యాటక సంబంధాలను మరింత మెరుగుపరచనుంది. అలాగే ఆరోగ్యం, విద్య వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకునేందుకు పలు ఒప్పందాలు చేసుకున్నారు.
ఈ ఏడాది ఆగస్టులో నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి మోడీ సంతాపం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, కష్టకాలంలో భారత్ ఎప్పుడూ నేపాల్‌కు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది చమురు సరఫరాలో తీవ్ర సవాళ్లు ఎదురైనప్పటికీ, నేపాల్‌కు అవసరమైన సరుకులను అందించామని వెల్లడించారు.
మరోవైపు.. భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడమే తన పర్యటన ముఖ్య ఉద్దేశమని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా తెలిపారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఇరు దేశాల స్నేహాన్ని భవిష్యత్తులో మరింత బలపరచాలని ఆకాంక్షించారు. తాజా చర్చల ద్వారా కుదిరిన నిర్ణయాలు భారత్-నేపాల్ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో సరిహద్దు వివాదంపై నేపాల్ వైఖరితో కొంత ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

