NTV Telugu Site icon

Pinnelli Ramakrishna Reddy: ముందస్తు బైయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి.. కాసేపట్లో విచారణ

New Project (1)

New Project (1)

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పోలింగ్ కేంద్రంలో దూరి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ1గా చేర్చారు. ఆయన గత కొన్ని రోజులుగా అందుబాటులో లేకపోవడంతో ఆయన కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. మరి కొద్ది గంటల్లో ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా.. నర్సరావు పేట కోర్టులో లొంగిపోతారన్న ప్రచారం జోరుగా సాగింది. పోలీసులు పెద్ద మొత్తంలో కోర్టుకు చేరుకున్నారు. విచారణకు పిన్నెల్లి వస్తే అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు.

READ MORE: Swati Maliwal: నాపై దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు.. స్వాతి మలివాల్ సంచలనం..

కాగా.. మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వెళ్లాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు చేశారు పోలీసులు. విటన్నింటి నేపథ్యంలో ఆయన తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హై కోర్టును ఆక్రయించారు.