Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు

Ai

Ai

Islamabad: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి ‘పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (PIMS)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని గైనకాలజీ విభాగం వార్డులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే, అగ్నిప్రమాదం జరిగిన వార్డులోనే ఉన్న 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోనే అత్యంత ఆధునిక వైద్య సౌకర్యాలు కలిగిన అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా PIMS గుర్తింపు పొందింది. ప్రమాదం జరిగే సమయంలో ఆ వార్డులో 15 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారని, ఈ దుర్ఘటనలో వారంతా ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికార ప్రతినిధి డాక్టర్ అనీజా జలీల్ అధికారికంగా ధ్రువీకరించారు. సమాచారం అందుకోగానే రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక వాహనాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర శ్రమతో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.

ఏసీ యూనిట్‌లోని ఆక్సిజన్ కంప్రెసర్ ఒక్కసారిగా పేలిపోవడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కానీ.. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, జరిగిన మొత్తం నష్టంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విషాదకర సంఘటనతో ఆసుపత్రుల్లో అగ్నిమాపక భద్రత, అత్యవసర రక్షణ చర్యల నిర్లక్ష్యంపై తీవ్రమైన విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం, పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనపై వెంటనే విచారణ జరపాలని షరీఫ్ అధికారులను ఆదేశించారు. ఈ విషాద సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొంటూ.. అమాయక పిల్లల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.