తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్‌లో పేరొన్నారు.
మహిళలకు ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దీని వలన అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని పిటిషనర్ పిల్‌లో పేరొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2023 డిసెంబర్ 8న జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు. కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో ఉచిత పథకంపై అధికారం రాష్ట్రానికి లేదన్న పిటిషనర్ తెలిపారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్థికంగా ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరించడం కూడా అన్యాయమేనని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బును మహిళల ఉచిత ప్రయాణ వసతికి వినియోగించడం చెల్లదన్నారు.
Also Read: Kalti Kallu: గోదావరిఖనిలో విషాదం.. మందు పార్టీ అనంతరం ఇద్దరు స్నేహితుల దుర్మరణం!
ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నిలిపివేస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ చైర్మన్, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖను ఈ పిల్‌లో ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం త్వరలో విచారణ జరుపనుంది.
