NTV Telugu Site icon

Pidakala Samaram: పిడకల సమరం..! ఇంత ఇంట్రెస్టింగ్ లవ్‌ స్టోరీ ఉందా..?

Pidakala Samaram

Pidakala Samaram

Pidakala Samaram: ప్రేమికులను విడదీసిన పెద్దలను చూసుంటాం, ప్రేమ కథలు విషాదాంతంగా ముగిసిన సందర్భాలనూ విని ఉంటాం.. కానీ, ప్రేమను గెలిపించే పోరాటం పిడకల సమరం మాత్రం మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.. దానికి మన ఆంధ్రప్రదేశ్‌ వందల ఏళ్ల క్రితమే వేదికగా మారింది.. చరిత్రలో నిలిచిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పాల గ్రామంలో శ్రీ భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది మరుసటి రోజు ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులని ఆలయ చరిత్ర చెబుతోంది. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో కొంత ఆలస్యం చేస్తారు వీరభద్రస్వామి. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా తమ భద్రకాళి దేవిని వీరభద్ర స్వామి మోసం చేసారని అమ్మ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారట.

అయితే, వీరభద్ర స్వామిని పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. దీనిని తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకొంటారు. కానీ, స్వామి భక్తులు చెప్పిన మాటలు వినకుండా అమ్మవారి ఆలయం వైపు వెళ్తారు.. అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకోన్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామిపై పేడతో తయారు చేసిన పిడకలు విసురుతారు.. ఇక, విషయం తెలుసుకున్న స్వామి వారి భక్తులు కూడా ప్రతిగా పిడకలతో అక్కడికి వెళ్తారు.. అమ్మవారి భక్తులపై ఎదురుదాడికి దిగుతారు. అలా ఇరువర్గాలు పిడకల సమరం సాగిస్తారు. బ్రాహ్మదేవునికి వారి మధ్య జరుగుతున్న పిడకల సమరం విషయాన్ని విశ్వకర్మ (భద్రకాళి అమ్మ వారి) తండ్రి చెబుతారు. బ్రహ్మ దేవుడు వీరభద్ర స్వామి తండ్రి శివుడు దృష్టికి తీసుకుని వెళ్లడంతో.. అనంతరం బ్రహ్మ దేవుడు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారని చెబుతారు.

ఇక, పిడకల సమరంలో దెబ్బలు తగిలిన వారు భద్రకాళి అమ్మవారు వీరభద్ర స్వామి వార్ల ఆలయాలకు వెళ్లి నమస్కారం చేసుకొని అక్కడ ఆయా ఆలయాల్లో ఉన్న వీభూతిని ఇరువర్గాల భక్తులు రాసుకుని రావాలని బ్రహ్మ ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఒకే ఆలయంలో ఇద్దరు విగ్రహాలను ఏర్పాటు చేసి వారికి కల్యాణం జరిపిస్తామని బ్రహ్మ దేవుడు మాట ఇచ్చినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. స్వామి వార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే వారు పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించేలా చూడాలని కూడా బ్రహ్మ దేవుడు భక్తులను కోరాడట. అందుకు సమ్మతించిన భక్తులు.. బ్రహ్మ దేవుడ్ని కైరుప్పల గ్రామం పక్కన ఉన్న కారుమంచి గ్రామంలో ఉన్న ఒక రెడ్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించేలా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెబుతారు,
అలా ప్రతి ఏటా ఉగాది ఉత్సవాలలో భాగంగా స్వామి వార్ల పిడకల సమరం జరిగే కొన్ని నిమిషాలకు ముందు కారుమంచి గ్రామం నుంచి ఒక రెడ్డి కుటుంబ సభ్యులు ఆచారం ప్రకారం గుర్రంపై కైరుప్పల గ్రామానికి ఊరేగింపుగా చేరుకొంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. వారి ప్రత్యేక పూజలు నిర్వహించిన కొన్ని నిమిషాల తర్వాత గ్రామస్థులు ఇరువర్గాలగా విడిపోయి పిడకలతో కొట్టుకొంటారు. ఇలా కొట్టుకోవడం ఒక సంప్రదాయం అని భక్తులు అంటున్నారు. పిడకల సమరంలో దెబ్బలతగిలిన వారు ఆలయానికి వెళ్లి స్వామి వార్లకు నమస్కారం చేసుకొంటారు. అక్కడ ఉన్న వీభూతిని దెబ్బలు తగిలిన చోట వేసుకొని ఇళ్ళకు వెళ్ళిపోతారు. ఈ సంప్రదాయ క్రీడను కొన్ని తరాలుగా గ్రామస్థులు జరుపుకోవడం విశేషం. దీన్ని చూడటానికి వేలాదిగా జనం తరలివస్తారు. పిడకల సమరం ముగిసిన మరసటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారికి, వీరభద్ర స్వామి వారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపిస్తారు.