Piaggio Ape WavE: ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ పియాజియో వెహికల్స్ (Piaggio Vehicles) కొత్తగా Ape WavE పేరుతో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీ-వీలర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల రవాణాను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 2.55 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు.
కొత్త పియాజియో Ape WavEలో 5.4 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనికి అనుసంధానించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 3 kW పవర్, 25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనం గంటకు గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. నగర రవాణా అవసరాలకు అనుగుణంగా దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.
ఇక రేంజ్ విషయానికి వస్తే.. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4.5 గంటల సమయం పడుతుంది. దీంతో రోజువారీ ప్రయాణికుల రవాణాకు ఇది అనుకూలంగా ఉండనుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో 19% గ్రేడబిలిటీని అందించారు. దీంతో ఎత్తైన రహదారులు, వంపులు ఉన్న ప్రాంతాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. వాహనాన్ని పూర్తి మెటల్ బాడీ, మోనోకోక్ నిర్మాణంతో తయారు చేశారు. దీని వల్ల దీర్ఘకాలిక మన్నికతో పాటు వాణిజ్య వినియోగానికి తగిన బలాన్ని అందిస్తుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థను అందించారు. ఇది ప్రయాణ సమయంలో వచ్చే శబ్దం, కంపనాలను తగ్గించి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుంది. అదనంగా 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో వివిధ రకాల రహదారులపై సులభంగా నడుస్తుంది. క్యాబిన్‌ను విశాలంగా రూపొందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించారు. అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు, తక్కువ యాజమాన్య వ్యయాలతో వాహన యజమానులకు ఆదాయ అవకాశాలను పెంచే విధంగా ఈ మోడల్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.
షేర్డ్ మొబిలిటీ సేవలు, ఫిక్స్‌డ్ రూట్ రవాణా, స్వల్ప దూర ప్రయాణికుల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని Ape WavEను రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందాలనుకునే ఆటో డ్రైవర్లు, ఫ్లీట్ ఆపరేటర్లకు ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

