Minister Konda Surekha on Medaram Jatara: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం ‘సమ్మక్క సారలమ్మ’ జాతరకు వచ్చే భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పిస్తాం అని పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది.
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.152.96 కోట్లు కేటాయించింది. తొలి విడత కింద రూ.150 కోట్లు రిలీజ్ చేసింది. ఈ నిధులతో మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్తు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది.
Also Read: MLC Kavitha: కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే.. నన్నే టార్గెట్ చేశారు!
‘గత ప్రభుత్వం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు. తూర్పు నియోజకవర్గంలోని కాలనీలు ముంపుకు గురి కాకుండా ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వరద కాలువ నిర్మాణం పూర్తయితే వరంగల్ తూర్పు వరద ముంపు గురి కాకుండా ఉంటుంది. వరంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. వరంగల్‌ను ముంపు ప్రాంతాలు లేని నగరంగా మార్చుతాం’ అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కోటి రూపాయల వ్యయంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు.
