Site icon NTV Telugu

PBKS vs MI: శ్రేయస్‌ అయ్యర్ మెరుపులు.. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌!

Rcb Ipl Title

Rcb Ipl Title

పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్) ఐపీఎల్ 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది. అహ్మదాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన క్వాలిఫయర్‌-2లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన పంజాబ్.. టైటిల్ పోరుకు సిద్ధమైంది. 204 పరుగుల భారీ లక్షాన్ని కేవలం 19 ఓవర్లలోనే ఐదు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (87; 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ దాటికి ముంబై మరో టైటిల్ కల చెదిరింది. ఫైనల్‌కు వెళ్లడం పంజాబ్‌కు ఇది రెండోసారి. 2014లో జార్జ్ బెయిలీ నేతృత్వంలో పంజాబ్‌ మొదటిసారి ఫైనల్‌ చేరింది. మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ ఫైనల్‌లో తలపడనుంది.

క్వాలిఫయర్‌-2లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8) విఫలమైనా.. జానీ బెయిర్‌స్టో (38: 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తిలక్‌ వర్మ (44: 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (44: 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 15 పరుగులే చేసినా.. నమన్‌ ధీర్‌ (37: 18 బంతుల్లో 7 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంజాబ్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 2 వికెట్స్ పడగొట్టగా.. కైల్ జెమీసన్‌, మార్కస్ స్టాయినిస్‌, యుజ్వేంద్ర చహల్‌, వైశాక్‌ విజయ్ కుమార్ ఒక్కో వికెట్‌ తీశారు.

ఛేదనలో పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ప్రభు సిమ్రాన్ సింగ్ (6) తక్కువ పరుగులకే అవుట్ కాగా.. ఫామ్ మీదున్న ప్రియాంష్ ఆర్య (20) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ సమయంలో జోష్‌ ఇంగ్లిస్‌ (38: 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఇంగ్లిస్‌ అవుట్ అయ్యాక పంజాబ్ పరుగుల వేగం తగ్గింది. ఆరంభంలో కాస్త టైమ్ తీసుకున్న శ్రేయస్ అయ్యర్.. ఆపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నేహల్‌ వధేరా (48: 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి కింగ్స్‌ను విజయం వైపు నడిపించాడు. నేహల్‌, శశాంక్ సింగ్ (2) అవుట్ అయినా.. శ్రేయస్ చివరి వరకూ క్రీజులో ఉండి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

Exit mobile version