NTV Telugu Site icon

PBKS vs KKR: ఈ వయసులో మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదు: రికీ పాంటింగ్‌

Ricky Ponting Pbks

Ricky Ponting Pbks

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన హృదయ స్పందన చాలా పెరిగిందని పంజాబ్‌ కింగ్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు. తనకు ఇప్పుడు 50 ఏళ్లు అని, ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదన్నాడు. ఈ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చహల్‌ ప్రదర్శన చెప్పలేనిదని, అద్భుతంగా బౌలింగ్‌ చేశాడన్నాడు. ఐపీఎల్‌లో తాను ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పనిచేశానని, ఈ విజయం మాత్రం ఉత్తమంగా మిగిలిపోతుందని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు. మంగళవారం కోల్‌కతాతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 16 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 112 పరుగుల ఛేదనలో కోల్‌కతా 95కే ఆలౌట్ అయింది.

మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ… ‘ఓ దశలో నా హృదయ స్పందన చాలా పెరిగింది. ఇప్పుడు నాకు 50 ఏళ్లు, ఈ ఏజ్‌లో ఇలాంటి మ్యాచ్‌లు చూడాల్సిన అవసరం లేదు. 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని, 16 పరుగుల తేడాతో గెలిచాం. నిజానికి ఇలాంటి స్వల్ప ఛేదనలో సగం మ్యాచ్‌ అయ్యాక చాలా కష్టంగా మారతుందని తెలుసు. ఇదే విషయం మా కుర్రాళ్లకు చెప్పా. పిచ్‌ కష్టంగా ఉంది, బ్యాటింగ్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. మ్యాచ్ అంతటా పిచ్ ఒకేలా ఉంది. యుజ్వేంద్ర చహల్‌కు గత మ్యాచ్‌లో భుజానికి గాయం అయింది. మ్యాచ్‌కు ముందు అతడికి ఫిట్‌నెస్‌ టెస్టు జరిగింది. ప్రాక్టీస్‌ చేస్తుండగా ఫిట్‌గా ఉన్నావా అంటే.. 100 శాతం ఉన్నానన్నాడు. చహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు, అతడి ప్రదర్శన చెప్పలేనిది. ఒక వేళ ఈ మ్యాచ్‌లో మేము ఓడిపోయినా.. సెకండ్‌ హాఫ్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శన చూసి నేను గర్వపడేవాడిని’ అని తెలిపాడు.

‘మా బ్యాటింగ్‌ ఏమంత బాలేదు. షాట్‌ల ఎంపిక దారుణంగా ఉన్నాయి. బ్యాటింగ్‌ అనంతరం మా ఆటగాళ్లు ఫీల్డింగ్‌కి వచ్చారో అంతా మారింది. తొందరగా వికెట్లు పడగొట్టారు. ఒకవేళ విజయం దగ్గరిదాకా వచ్చి ఓడిపోతే.. సీజన్‌లో అదే టర్నింగ్‌ అవుతుందని ఆటగాళ్లకు ఎప్పుడూ చెబుతుంటా. మ్యాచ్‌ సగం అనంతరం ప్లేయర్స్ గెలుస్తామో లేదా అని అపనమ్మకంగా ఉంటారు. అయితే ఈ రోజు మా ప్లేయర్స్ బాగా ఆడి సాధించారు. ఈ విజయం క్రెడిట్‌ వాళ్లకే దక్కుతుంది. చాలా బాగా ఆడారు. ఐపీఎల్‌లో నేను ఎన్నో మ్యాచ్‌లకు కోచ్‌గా పని చేశాను కానీ.. ఈ విజయం అత్యుత్తమం’ అని రికీ పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.