Paytm Services: పేటీఎం వినియోగదారులకు శుభవార్త.. ఆ సేవలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..

Paytm

Paytm

భారతదేశంలో ప్రీపెయిడ్ వాలెట్లను జారీ చేయడానికి పేటీఎం సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. వన్ 97 కమ్యూనికేషన్స్ అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ (PPSL) డిజిటల్ వాలెట్లతో సహా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ జారీ చేయడానికి, నిర్వహించడానికి ఈ అనుమతిని పొందింది. అయితే.. వాలెట్ సేవలను తిరిగి ప్రారంభించడానికి ముందు సంస్థ ఆర్‌బీఐ నుంచి తుది నియంత్రణ అనుమతి పొందాల్సి ఉంటుంది.

ఆగస్టు 27, 2021న ఆర్‌బీఐ జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్స్, ఆ తర్వాత చేసిన సవరణలకు లోబడి ఈ ఆమోదం లభించింది. ప్రస్తుత సూత్రప్రాయ అనుమతితో పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ తక్షణమే వాలెట్ సేవలను ప్రారంభించడానికి వీలులేదు. దీనికోసం కేంద్ర బ్యాంకు నుంచి తుది ‘సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్’ తప్పనిసరిగా పొందాలి.

గతంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)పై ఆర్‌బీఐ తీసుకున్న కఠిన చర్యల నేపథ్యంలో ఈ తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. నిబంధనల ఉల్లంఘన, కార్యకలాపాలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్ 24, 2026న ఆర్‌బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసి, బ్యాంకింగ్ కార్యకలాపాలను నిలిపివేసింది. అంతకుముందే 2022 మార్చిలో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై, 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఖాతాలు మరియు వాలెట్లలో డిపాజిట్లు, టాప్-అప్‌లపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

అయితే, తాజాగా లభించిన ఆమోదం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు కాకుండా, వన్ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ప్రత్యేక అనుబంధ సంస్థ అయిన పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్‌కు మాత్రమే లభించింది. ఆర్‌బీఐ తుది అనుమతి లభించిన తర్వాత, పేటీఎం తన వాలెట్ సేవలను తిరిగి అందించడానికి ఈ నిర్ణయం ఒక ప్రత్యేక నియంత్రణ మార్గాన్ని సుగమం చేసింది.