Pawan Kalyan: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కీలక భూమిక పోషించి.. కూటమి విజయంలో ప్రత్యేక పాత్ర పోషించి.. తిరుగులేని విజయాన్ని అందుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. దీంతో ఆయనపై అభినందనలు, శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.. అయితే, ఈ నేపథ్యంలో.. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులకు కీలక విజ్ఞప్తి చేశారు జనసేనాని పవన్ కల్యాణ్.. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు..
‘ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరుల నుంచి అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి.. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందలు అందిస్తారు.. జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదులు తెలిపిన ఆయన.. రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.. త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కేంద్ర కార్యాలయం ద్వారా తెలియచేస్తాము.. అభినందలు తెలియజేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్..
ఇక, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.. అదే విధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి.. వీటిని పూర్తి చేసుకొని.. నన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తాను అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఈ నెల 20వ తేదీ తర్వాత పిఠాపురం నియోజకవర్గంలోని కార్యకర్తలను కలుస్తాను.. ఆ తర్వాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను అని జనసేనాని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో వెల్లడించారు.