Site icon NTV Telugu

Pawan Kalyan: కూటమి ప్రభుత్వానికి పవన్‌ ఝలక్‌లు ఇస్తున్నారా?.. డూడూ బసవన్నను కాదని చెప్పదల్చుకున్నారా?

Pawan Kalyan

Pawan Kalyan

ఏపీలో కూటమి ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్‌ ఝలక్‌లు ఇస్తున్నారా? కేబినెట్‌ మీటింగ్‌లోనే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తున్నారా? అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ దూకుడుకు సడన్‌ బ్రేకులు పడుతున్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కేబినెట్‌లో పవన్‌ ఎందుకు అడ్డుపడుతున్నారు?.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్ళు అలా… అలా… గడిచిపోయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. కానీ…ఇప్పుడు మాత్రం ఆ పరంగా… ఎక్కడో, ఏదో… తేడా కొడుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతమాత్రాన ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేకున్నా… జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ స్వరం మారుతోందని, కేబినెట్‌ మీటింగ్‌లో ఆయన వ్యహారశైలే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అది అన్నిటికీ తలూపేస్తూ… డూడూ బసవన్నలా మారిపోయారన్న బ్యాడ్‌ ఇమేజ్‌ తనకు రాకుండా చూసుకోవడానికా? లేక నిజంగానే తాను లేవనెత్తిన అంశాల విషయంలో ఆయన ఇక మీదట నిక్కచ్చిగా ఉంటారా అన్న చర్చలు సైతం మొదలయ్యాయి రాజకీయవర్గాల్లో. ఇటీవలి కాలంలో క్యాబినెట్ సమావేశాల్లో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ అడ్డుకట్ట వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ప్రధానంగా రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ విషయంలో గట్టిగా అభ్యంతరపెట్టారట పవన్‌. రైతుల అభిప్రాయాలు తీసుకున్నాకే.. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై ముందుకు వెళ్లాలన్నది ఆయన అభిప్రాయం. దానికి సంబంధించి క్యాబినెట్‌లో చర్చ జరుగుతున్నప్పుడే అడ్డుపడ్డారట ఉప ముఖ్యమంత్రి. దాంతో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు దూకుడుగా ముందుకు వెళ్దామనుకున్న సర్కార్‌… కాస్త వెనకడుగు వేసినట్టు చెప్పుకుంటున్నారు. అంతకు ముందు రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి రక రకాల ప్రకటనలు చేసింది ప్రభుత్వం. అమరావతిలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, పరిశ్రమల స్థాపన…ఇతరత్రా అభివృద్ధి కోసం అదనపు భూమి అవసరమంటూ ప్రకటించారు ప్రభుత్వ పెద్దలు. కానీ.. ఆ నిర్ణయంతో పవన్‌ డిఫర్ అవడంతో… అక్కడే ఆగిపోయిందట. ఇక తాజాగా నాలా చట్ట సవరణ ప్రతిపాదనను కూడా డిప్యూటీ సీఎం అడ్డుకున్నట్టు సమాచారం. నాలా అంటే… వ్యవసాయ భూమిని..వ్యవసాయేతర అవసరాలకు వినియోగించమేనని, దీంతో వ్యవసాయ భూమి దుర్వినియోగం అవడంతోపాటు రైతులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశ్యంతో పవన్ ముందుకు వెళ్ళనీయలేదని చెప్పుకుంటున్నారు.

Also Read: Oval Test: అయ్యో దేవుడా.. కీలక సమయంలో ఇంగ్లండ్‌కు భారత్ ఫ్రీ గిఫ్ట్‌!

అలాగే…. అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ విషయంలో జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్‌ అడ్డుపడ్డారట. దీంతో ఆ అంశాలు వచ్చే కేబినెట్‌ మీటింగ్‌కు వాయిదా పడ్డాయి. కీలక మైన అంశాల విషయంలో ఈ రకమైన పరిస్థితి ఉండడం, ప్రధానంగా భూ సమీకరణ కోసం రైతుల అభిప్రాయాలు తీసుకోమని పవన్‌కళ్యాణ్‌ చెప్పడం కొంత ఇబ్బందికరంగా మారిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ వర్గాల్లో. ప్రస్తుతం కూటమి నేతల మధ్య కూడా ఇదే చర్చ జరుగుతోందంటున్నారు. ఇప్పటి దాకా ఒక లెక్క… ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా పవన్ వైఖరి ఉందని మాట్లాడుకుంటున్నారు కూటమి నాయకులు. అయితే…. గడిచిన ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పెద్దగా స్పందించని పవన్ ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారన్నది బిగ్‌ క్వశ్చన్‌ అంటున్నాయి రాజకీయ వర్గాలు. పైకి సఖ్యతగా కనిపిస్తున్నా కీలకమైన విషయాల్లో ఎందుకు జనసేన డిఫర్ అవుతోందన్న విషయంలో… కూటమి నాయకుల మధ్య గట్టి చర్చలే జరుగుతున్నాయట. క్యాబినెట్ మీటింగ్‌లో…. చర్చ జరుగుతున్న సమయంలో…. ఈ రకంగా అడ్డుతగలడం, వాయిదా పడటం ఎంతవరకు కరెక్ట్‌ అన్న డిస్కషన్‌ స్టార్ట్ అయిందట నేతల్లో. అయితే… ఇందులో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయన్నది ఇంకో వెర్షన్‌. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా… గుడ్డిగా సమర్ధించకుండా…. ఆచితూచి వ్యవహరిస్తేనే భవిష్యత్ బావుంటుందని పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్నట్టు సమాచారం.

ఉదాహరణకు రెండో విడత ల్యాండ్ పూలింగ్‌నే తీసుకుంటే… ఆ విషయంలో నిజంగానే రైతుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోందని….సంగతి తెలిసే పవన్ వ్యతిరేకిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి కూటమి వర్గాల్లో. అందుకే టీడీపీ ముఖ్యులు కూడా మరో మాట లేకుండా ఆ ప్రతిపాదనను పక్కకు పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో… ఇప్పుడు కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించి డిఫర్ అవుతున్న జనసేన వైఖరి… ముందు ముందు ఎలా ఉంటుంది… ఇతర ముఖ్యమైన అంశాల విషయంలో పవన్‌ నిర్ణయాలు ఎలా ఉండబోతోందన్న ఉంత్కంఠ సైతం పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. ఇదేదో వెంటనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదని… అయినాసరే…. కీలక అంశాల్లో క్యాబినెట్‌ మీటింగ్‌లో కూర్చుని విమర్శిండం, అడ్డు పడడం ఏంటన్న చర్చలు సైతం నడుస్తున్నాయట. ప్రస్తుతం జనసేన మాత్రమే అడ్డు పడుతోందని, రేపు బీజేపీ కూడా ఇదే లైన్‌లోకి వస్తే ఏంటన్న అనుమానాలు సైతం తెలుగుదేశం వర్గాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version