అమరావతిలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మధ్యలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో పాల్గొన్న పవన్.. తీవ్ర వెన్నునొప్పి కారణంగా మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో పవన్‌కు వెన్నునొప్పి ఎక్కువ కావడంతో సచివాలయం నుంచి మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంపు కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేబినెట్ సమావేశం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి, అమరావతి నిర్మాణం, సంక్షేమ పథకాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పవన్ శుక్రవారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మైలవరం నియోజకవర్గంలోని మూలపాడు గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మూలపాడులోని బటర్‌ఫ్లై పార్క్‌లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు పవన్ అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
