మాజీ రాష్ట్ర మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి 2019 మార్చి 15 తెల్లవారేసరికల్లా పులివెందులలోని తన స్వంత ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట గుండెపోటు కారణంగా మరణించాడని నివేదికలు వచ్చినా, క్రమేపీ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడన్న విషయం సంచలనం సృష్టించింది. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. తాజాగా వివేకా హత్యపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హత్య జరిగిందని అందరికీ తెలుసు అని అన్నారు. మన కళ్లముందే హత్య జరిగినా కేసును ఏం చేయలేకపోతున్నాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
Also Read:ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎడీఎస్ అనిల్ చౌహాన్!
కాగా వివేకా హత్య కేసుపై సుదీర్ఘకాలంగా విచారణ జరుగుతోంది. ఈ కేసుకి సంబంధించిన నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ.. వివేకా కూతురు సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 16 న విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుల బెయిల్ రద్దు అంశంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పటికే సీబీఐ ఫైనల్ ఛార్జిషీట్ ఫైల్ చేసిన క్రమంలో నిందితుల బెయిల్ రద్దు విషయంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.
