క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ చిత్తుచేసింది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సోమవారం జరిగిన మూడో వన్డేలో ప్రొటీస్‌పై 69 పరుగుల తేడాతో ఐరిష్ జట్టు గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను ఐర్లాండ్ ఓడించడం ఇది రెండోసారి. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఐర్లాండ్ 1-2తో ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ స్టిర్లింగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (88; 92 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యారీ టెక్టర్ (60; 48 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) హాఫ్ సెంచరీలు చేశారు. బాల్బిర్నీ (45; 73 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), క్యాంపర్ (34; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఛేదనలో దక్షిణాఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. జేసన్ స్మిత్ (91; 93 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. అడైర్, హుమే దెబ్బకు 10 పరుగులకే ప్రొటీస్ మూడు వికెట్లు కోల్పోయింది. ర్యాన్ రికెల్టన్ (4), రీజా హెండ్రిక్స్ (1), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (3) త్వరగానే పెవిలియన్ చేరారు. కైల్ వెర్రెయిన్నే (38), ట్రిస్టన్ స్టబ్స్ (20) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జేసన్ స్మిత్ పోరాడినా.. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించలేదు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్, హుమే చెరో మూడు వికెట్లు తీశారు.