Patna High Court Rape Case Verdict: అత్యాచారం కేసులో పాట్నా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహిళ మీద పడుకున్నంత మాత్రాన, తగిన ఆధారాలు లేకపోతే దానిని అత్యాచారంగా పరిగణించలేమని పాట్నా హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళపై అత్యాచారం జరిగిందంటూ నమోదైన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్లోని బెగుసరాయ్ కోర్టులో ఓ వితంతువుపై అత్యాచారయత్నం జరిగిందంటూ కేసు నమోదైంది. ఫిబ్రవరి 8, 2010 రాత్రి 10 గంటల సమయంలో మహమ్మద్ ఐనుల్ హక్ అనే వ్యక్తి ఆ మహిళ గుడిసెలోకి అక్రమంగా ప్రవేశించాడు. ఆమె నోరు మూసి, దుర్ఉద్దేశంతో ఆమె శరీరంపైకి ఎక్కాడు. ఆ తర్వాత అతను నోరు మీద నుంచి చేయి తీయగానే ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న వెంటనే ఇరుగుపొరుగున ఉన్న పది నుంచి పదిహేను మంది గ్రామస్తులు, ముఖ్యంగా ఆమె పక్కనే ఉండే పొరుగువారు అక్కడికి చేరుకుని నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ ఘటనపై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. జూలై 29, 2013న బెగుసరాయ్ ట్రయల్ కోర్టు నిందితుడు మహమ్మద్ ఐనుల్ హక్ను దోషిగా తేల్చింది. అతనికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హక్ హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశాడు. ఈ అప్పీల్పై విచారణ జరిపిన పాట్నా హైకోర్టు ఏకసభ్య బెంచ్ జస్టిస్ సందీప్ కుమార్ అక్టోబర్ 8న ఈ తీర్పును వెలువరించారు. ఆ తీర్పు వివరాలు మంగళవారం బయటకు వచ్చాయి. హైకోర్టు విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రయల్ కోర్టు విచారణ సమయంలో ఆ మహిళ మినహా మిగతా సాక్షులందరూ హోస్టిల్ (వ్యతిరేకంగా) మారిపోయారు. అంతేకాకుండా, ప్రాసిక్యూషన్ తరఫు నుంచి ఎటువంటి బలమైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు, మచ్చలు ఉన్నట్లు చూపించే మెడికల్ ఎవిడెన్స్ లేదు. అలాగే చిరిగిపోయిన లేదా చెల్లాచెదురైన బట్టలు వంటి మెటీరియల్ ఎవిడెన్స్ కూడా సమర్పించలేకపోయారు.
బాధితురాలైన మహిళ చెప్పిన సాక్ష్యాన్ని పూర్తిగా నమ్మినప్పటికీ, అందులో ఉన్న పరిస్థితుల ఆధారంగా క్రిమినల్ ట్రెస్పాస్, అసాల్ట్ (దాడి) కిందకే వస్తుందని, అంతేకాని దానిని అత్యాచారంగా నిర్ధారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాట్నా హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన అత్యాచార శిక్షను రద్దు చేసి, దానిని ఇన్సెంట్ అసాల్ట్ (మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన లేదా దాడి) కింద మార్చింది. అయితే మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు గాను నిందితుడికి రూ. 25,000 జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు వారాల్లోగా ఆ మహిళకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు వెలువరించే సమయంలో జస్టిస్ సందీప్ కుమార్.. 2004లో వచ్చిన అమన్ కుమార్ వర్సెస్ హర్యానా రాష్ట్రం కేసు, 1995లో వచ్చిన రూపన్ డియోల్ బజాజ్ వర్సెస్ కేపీఎస్ గిల్ కేసులకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను ప్రాతిపదికగా తీసుకున్నారు.

